నేను సమ్మిళిత రూపాన్ని

దాదాపు నాలుగు దశాబ్దాల సాహిత్య ప్రయాణం మొత్తంలోనూ ప్రశంస, విమర్శ తనని ఎక్కువ వేధించకుండా నిలువరించగలిగిన స్థితప్రజ్ఞత, కాలంలో సమానంగా నడవగలిగిన హృదయం, అనేక ప్రక్రియల ద్వారా మానవ అంతరంగపు అన్వేషణ, బహుళ తాత్విక పునాదుల శోధనల ద్వారా తెలంగాణ, తెలుగు సాహిత్యాలలో అరుదైన స్వరం ‘వంశీకృష్ణ’తో కె ఎన్ మల్లీశ్వరి ఇంటర్వ్యూ   

సాహిత్యం చదవడం, రాయడం మీ ఉనికిని ఎలా ప్రభావితం చేసింది?

సాహిత్యం చదవడం అనేది కేవలం అలవాటు కాదు, అది ప్రపంచాన్ని చూసే కళ్ళను మార్చే ప్రక్రియ. రాయడం అనేది నన్ను నేను సంస్కరించుకునే మార్గం. సామాజిక సంక్లిష్టతలను, మానవ సంబంధాల లోతును అర్థం చేసుకోవడంలో సాహిత్యం నాకు దిక్సూచిలా నిలిచింది. అది నా ఉనికిని కేవలం ఒకవ్యక్తిగా కాకుండా, నిరంతర అన్వేషకుడిగా తీర్చిదిద్దింది. నా చుట్టూ ఉన్న మౌనాన్ని అక్షర రూపంలోకి మార్చడం ద్వారానే నా అస్తిత్వాన్ని వెతుక్కున్నాను. అస్తిత్వ ఉద్యమాలు బలంగా వున్నప్పుడు కవిగా గొంతు విప్పుకున్నాను కనుక సహజంగానే మార్జినలైజ్డ్ అస్తిత్వాలపట్ల నాకు సానుకూల భావం ఏర్పడింది. గ్లోబలైజేషన్ విధ్వంసం ప్రపంచాన్ని కమ్మేస్తున్న తరుణంలో, ఆ సంక్షోభాన్ని గుర్తించడం ద్వారా నా అస్తిత్వం నిరసన స్వరంగా మారింది. ‘డబ్బుపిట్ట’ మీనింగ్స్, కొన్నినేనులు వంటి కవిత్వం రాస్తున్నప్పుడు, ఆర్థిక శక్తులు మనిషి ఉనికిని ఎలా ఛిన్నాభిన్నం చేస్తున్నాయో అర్థం చేసుకునే ప్రక్రియలో నా ఉనికి మరింత పరిణతి చెందింది. సాహిత్యం నన్ను ప్రపంచ పౌరుడిగా మార్చింది.

వంశీకృష్ణ ప్రధానంగా కవా, కథకుడా, విమర్శకుడా, సమ్మిళితమా?

నన్ను నేను ఏదో ఒక చట్రంలో ఇరికించుకోవడానికి ఇష్టపడను. నాకు కవిత్వం ఎంత ఇష్టమో, కథ, విమర్శ, రాజకీయాలు, పర్యావరణం సినిమా, సంగీతం కూడా అంతే ఇష్టం. ప్రాథమికంగా నేను ఒక సమ్మిళిత రూపాన్ని. కవిత్వంలోని భావుకత, కథలోని జీవన చిత్రణ, విమర్శలోని విశ్లేషణాత్మక దృక్పథం, సంగీతంలోని సౌందర్యం ఇవన్నీ నాలోని విభిన్న పార్శ్వాలు. ఏ ప్రక్రియ చేపట్టినా, అందులో సృజనాత్మకత సత్యం పట్ల నిబద్ధత ఉండాలనేది నా ఉద్దేశ్యం.అనువాదకుడిగా నేను ఇతర భాషల సంస్కృతులను నాలోకి ఆవాహన చేసుకున్నప్పుడు, ఈ ప్రక్రియలన్నీ కలిసి నాలో సమగ్ర సాహిత్య వ్యక్తిత్వాన్ని నిర్మించాయి.

విమర్శలో వాచకమే ప్రధానమని ఇటీవలి మీ వ్యాసాలు నిరూపిస్తున్నాయి, మీ విమర్శనా పనిముట్లు ఏమిటి?

మీరన్నట్టు విమర్శలో వాచకానికి (Text) ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. రచయిత ఉద్దేశ్యం కంటే, అక్షరం ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకోవడం నాకు ముఖ్యం. నా విమర్శనా పనిముట్లు అంత పెద్దమాటలు ఎందుకు కానీ ప్రధానంగా వస్తువు, రూపాల నడుమ వుండే ఉండే అంతస్సూత్రాన్ని వెతకడం నా కిష్టం. తులనాత్మక అధ్యయనం, సృజన వెనుక ఉన్న సామాజిక శక్తులను విశ్లేషించడం నా విమర్శనా శైలిలో భాగం. సినిమా విమర్శలోనూ ఇదే లోతును వెతుకుతాను.

సుదీర్ఘ కాలంగా మీతో కలిసి నడుస్తున్న కొన్ని సాహిత్య స్నేహాల నుంచి ఏరుకున్న పూలు, గుచ్చుకున్న ముళ్ళను సాహిత్య పరిధిలో చెప్పగలరా?

సాహిత్య యాత్రలో స్నేహాలు చైతన్యాన్ని ఇస్తాయి. కొన్ని స్నేహాలు పూలవలె నా ఆలోచనలకు పరిమళాన్ని అద్దాయి, కొత్త మార్గాలను చూపించాయి. కలిసి చేసిన చర్చలు, పంచుకున్న విశ్లేషణలు నా ఎదుగుదలకు తోడ్పడ్డాయి. పరిమిత శతపథి, ప్రతిభారాయ్, గౌరహరి దాస్ , శివశంకరి, దేబబ్రత దాస్, తిలోత్తమా మజుందార్ వంటి భిన్న భాషా రచయితల కథలను అనువదిస్తున్నప్పుడు, ఆ సాహిత్య బాంధవ్యాలు నాకు ఎంతో మేధోపరమైన ఆనందాన్ని అందించాయి. ఇతర ప్రాంతీయ భాషల సాహిత్య సౌరభాన్ని తెలుగు పాఠకులకు అందించడం తృప్తిని ఇచ్చింది. అయితే, అదే సమయంలో విమర్శ వల్ల కలిగిన విభేదాలు ముళ్ళలా గుచ్చుకున్నాయి. ఒక రచనలోని లోపాలను ఎత్తిచూపినప్పుడు, మిత్రులు దూరమైన సందర్భాలు ఉన్నాయి. కానీ, సాహిత్యం పట్ల నాకున్న చిత్తశుద్ధి ఆ ముళ్ళను కూడా పూలలా స్వీకరించే హృదయాన్ని ఇచ్చింది. ఆ ముళ్ళు గుచ్చుకోవడం అంటే నా నిజాయితీకి పరీక్ష అనుకుంటాను

దాదాపు నాలుగు దశాబ్దాల సాహిత్య ప్రయాణాన్ని మీరే సమీక్షించుకుంటే ఏం అనిపిస్తోంది?

ఈ నలభై ఏళ్ల ప్రయాణం నాకు వినయాన్ని ఇచ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను రాసిన ప్రతి అక్షరం నా నిరంతర పరిణామ క్రమాన్ని ప్రతిబింబిస్తుంది. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందనే స్పృహ కలిగింది. ఎనిమిది కవిత్వ సంపుటాలు, మూడు కథా సంపుటాలు, సినిమా, కవిత్వ విమర్శలు.. ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇదొక నిరంతర యుద్ధంలా అనిపిస్తుంది. అనువాదాల కోసం దేశ విదేశాల సాహిత్యాన్ని చదవడం నా పఠనానుభవాన్ని విస్తృత పరచింది. సాహిత్యం నాకు పేరు ప్రఖ్యాతుల కంటే కూడా, జీవితాన్ని ప్రశాంతంగా, లోతుగా అర్థం చేసుకునే శక్తిని ఇచ్చింది. గతం ఒక పాఠమైతే, వర్తమానం ఒక ప్రయోగం. ప్రయాణం ఇంకా ముగియలేదు, కొత్త భాషలు, కొత్త జీవితాల అన్వేషణ సాగుతూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *