హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, శమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానమున్నదని అన్నారు. ప్రజలు తాము నిర్వర్తించే వృత్తులకు సంబంధించిన ఉత్పత్తి పరికరాలను, వినియోగించే వాహనాలను ఆయుధ పూజ చేసి గౌరవించుకునే గొప్ప సంప్రదాయం దసరా ప్రత్యేకతగా కేసీఆర్ పేర్కొన్నారు. పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, జమ్మి చెట్టు ను రాష్ట్ర వృక్షంగా గుర్తించడం తో పాటు దసరా పండుగ విశిష్టతను చాటే దిశగా నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో పలు కార్యక్రమాలు చేపట్టిందని కేసీఆర్ గుర్తుచేశారు. తాము ఎంచుకున్న సమున్నత లక్ష్యాలను చేరుకుని విజయం సాధించేలా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని దసరా సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.