స్థానిక ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్‌

పథకాల జాతర … భారీ బహిరంగ సభ, పదవుల పందారం

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రంగం సిద్దంచేసుకుంటున్నది. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తుండగా అదిగో ఇదిగో అంటూ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వొచ్చింది. అందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆరు గ్యారంటీలను అమలుచేయలేకపోయిందన్న అపవాద ప్రభుత్వంపైన ఉండడం కూడా ఒక కారణం. కాదు కూడదని ప్రభుత్వం దబాయించినప్పటికీ తమకు లబ్ధి చేరలేదంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు ఆరోపించడం, దాన్ని విపక్షాలు అధికార పార్టీ పైన దాడికి ఆయుధాలుగా మల్చుకోవడంతో రాష్ట్రంలో గత ఏడాది కాలంగా రాజకీయ దుమారం చెలరేగింది. అయితే స్థానిక ఎన్నికలకు ముందే ఈ అపవాద నుండి బయటపడేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పెద్ద పథకరచనే చేసింది. ఇచ్చిన హామీల అమలుకు జనవరి 26వ తేదీ ముహూర్తంగా నిశ్చయించింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేస్తామన్న మాటను ఏడాదికాలంగా వాయిదా వేస్తూ వొచ్చిన ప్రభుత్వం జనవరి 26న వాటికి శ్రీకారం చుట్టబోతున్నది. ఆ రోజున ఏకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి సిద్దమైంది.

ఈ పథకాల పంపిణీ వొచ్చే నెలలో జరుగనున్నాయనుకుంటున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసివచ్చే అవకాశాలు లేకపోలేదు. వాస్తవంగా కులగణన పేరున స్థానిక ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వొచ్చింది. పంచాయతీ ఎన్నికలు కులగణన అధారంగానే జరుపాలని బిసీ వర్గాలు పట్టుపట్టడంకూడా ఒక కారణం. అది ప్రభుత్వానికి కూడా కొంత వెసులు బాటుకు కారణమైంది. బిసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల కేటాయింపు లక్ష్యంగా నియమించిన డెడికేటెడ్‌ ‌కమిషన్‌ ‌క్షేత్రస్ధాయి పరిశీలన పూర్తిచేసుకున్నప్పటికీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సి ఉంది. ఒకవేళ అందజేసినా, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చేపట్టిన కులగణన నివేదిక బహిర్గతం చేయడం ద్వారా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌లపై సందిగ్ధత ఏర్పడింది.

సర్పంచ్‌, ఎం‌పిటీసి, జడ్‌పిటీసి ఎన్నికల్లో పోటీచేసేందుకు అన్నిపార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తెగ ఉత్సాహ పడుతున్నారు. ప్రభుత్వ వర్గాలనుండి వెలువడుతున్న సమాచారం మేరకు జనవరి చివరి వారంలో స్థానిక ఎన్నికల నొటిఫికేషన్‌ ‌విడుదల కానుంది. ఎన్నికలు ఫిబ్రవరి 15లోగా జరగవొచ్చనుకుంటున్నారు. కాని పక్షంలో ఏప్రిల్‌ వరకు వాయిదాపడే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మార్చ్ 2 ‌నుంచి 25 వరకు ఇంటర్‌ ‌పరీక్షలు, మార్చ్ 21 ‌నుంచి ఏప్రిల్‌ 2 ‌వరకు పదవతరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఆ వెంటనే డిగ్రీ పరీక్షలుంటాయి. అందుకే జనవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చి, ఫిబ్రవరి రెండవ వారంలోగా ఎన్నికలు పూర్తిచేసే అవకాశముంది. ముందుగా ఎంపిటీసీ, జడ్‌పిటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతున్నది. దానికి తోడు గతంలో ఉన్న కొన్ని నిబంధనలను కూడా ప్రభుత్వం సవరించింది. గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వారెవరికైనా ఇద్దరికి మించిన సంతానం ఉంటే, పోటీకి అనర్హుడని ఉండింది. ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేశారు. అలాగే పదేళ్ళపాటు వర్తించే రిజర్వేషన్‌నుకూడా తగ్గించి అయిదేళ్ళకు పరిమితం చేస్తున్నారు.

దీనివల్ల అనేకమంది ఆశవహులు పోటీకి సిద్దమవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేస్తున్న పథకాల పంపిణీ తమకు కలిసివస్తుందన్న నమ్మకం కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో ఏర్పడింది. దానికి తగినట్లుగా స్థానికఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌,  ‌క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ అయ్యే కార్యక్రమాలకు కూడా ఇప్పుడే ముహూర్తం సిద్దంచేసింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలకు నిరసన కార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహిస్తున్నారు. సంవిధాన్‌ ‌బచావో పేరిట ఈనెల 27న నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్‌పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులు రానున్నారు. ఈ బహిరంగ సభకూడా కాంగ్రెస్‌కు కలిసివొస్తుందని భావిస్తున్నారు. ఇదిలాఉంటే ఇదే సమయంలో ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటి కార్యవర్గ ఏర్పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. కార్యవర్గంలోకి తీసుకునే వారి కోసం వివిధ జిల్లాల నుంచి అధిష్టానం ఇప్పటికే జాబితాను తెప్పించుకుంది. అలాగే పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ఎం‌పిక, జిల్లా అధ్యక్షుల ఎంపికతో పాటు, సంవత్సర కాలంగా వాయిదా వేస్తూ వొస్తున్న మంత్రివర్గ విస్తరణకు కూడా స్థానిక ఎన్నికలకు ముందే చేపట్టనుండడంతో పార్టీలో హడావిడి చోటుచేసుకుంది.

image.png

మండువ రవీంర్‌రావు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page