“ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించింది. ఈ ప్రణాళిక ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది..”
ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, సెల్ – 9866255355.
దశాబ్దాల పాటు పరాయి పాలనలో మగ్గి, శాంతియుత ఉద్యమంతో స్వరాష్ట్రాన్ని సాధించుకొని, గత ప్రభుత్వంలో నెరవేరని ఆకాంక్షలు తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. రేవంత్ దూరదృష్టి, తెలంగాణ రైజింగ్ 2047 అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుపుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ ప్రజల మెప్పు పొందుతున్నది. సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతూ దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న “99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, సుశాసనానికి ఒక బలమైన అడుగు వేసింది. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా గ్రీవెన్స్ సెల్ కి వెళ్లకుండా, ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. సభ ఆరంభంలో రాష్ట్ర గీతం ఆలపించి సభలో సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,ఉచిత ఆర్టీసీ ప్రయాణం,రూ.500లకు గ్యాస్ సిలిండర్, గృహాజ్యోతి,పెంచిన పింఛన్ల పథకాలపై గ్రామస్తులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.అర్హత ఉన్నలబ్దిదారులకు పథకాలు సక్రమంగా అందించేందుకు ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక ఎంతో దోహదపడింది.ఇన్నాళ్లు దీర్ఘకాలంగా పెండింగ్ లో పరిష్కారం కానీ సమస్యలు సైతం 99రోజుల ప్రణాళికలో భాగంగా తక్షణ పరిష్కారం అందించారు.
ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 28 డిసెంబర్,2023 నుండి 6 జనవరి,2024 వరకు ప్రజాపాలన నిర్వహించింది. రెండవ దఫాలో జనవరి 26,2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించి, అనేక సమస్యలను గుర్తించింది. రెండు విడతల్లో ప్రజల నుండి వచ్చిన సూచనలు,సలహాలు అభ్యర్థనల ఆధారంగా గత సంవత్సరంలోనే 14.4 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. అర్హులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసింది.మూడోసారి తలపెట్టిన 99 రోజుల ప్రణాళికలో సర్పంచ్ నుండి ఎమ్మెల్యే,ఎంపీల వరకు గల్లీ నుంచి దిల్లీ వరకు ఉన్న ప్రజాప్రతినిధులందరిని భాగస్వాములు చేసింది. మండల,పట్టణ, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు,ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అర్హులకు చేరే విధంగా పది వారాల పాటు వారానికో ఒక శాఖ,వారోత్సవాలను రాష్ట్రం అంతా ఘనంగా నిర్వహించి ప్రభుత్వ ఆకాంక్షను తెలియజేసింది.ఈ 99 రోజుల ప్రణాళికలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, యువజన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది.ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ సౌకర్యం, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల సంక్షేమం, రైతు భరోసా ద్వారా రైతులకు ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ వసతి కల్పన వంటి కార్యక్రమాలు పలు సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయాంటే అతిశయోక్తి కాదు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించింది. ఈ ప్రణాళిక ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వమే ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నది. గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తక్షణ పరిష్కారం నోచుకోని ప్రజల అవసరాలను గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఫిర్యాదులు మరియు ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో అందించడం ద్వారా ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరాన్ని తగ్గించింది. పారదర్శకత, జవాబుదారీతనం మరియు సమర్థవంతమైన పాలనకు ఈ కార్యక్రమం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది.రెండున్నర ఏళ్ల ప్రజా పాలనలో దేశంలో తెలంగాణ ఒక మోడల్ గా నిలిచింది.ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ అభివృద్ధి కార్యక్రమం విజయవంతం కాదు.ప్రజల సహకారంతోనే తెలంగాణను మరింత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుంద నేది గుర్తెరగాలి.
ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం,పరిశ్రమలు, వ్యవసాయం,మౌలికవసతులు, ఉపాధి అవకాశాలే ప్రధాన చర్చ కావాలి. అందులో భాగంగా రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రత్యక్షంగా లక్షల ప్రజాసమస్యలకు ప్రజాప్రతినిధులు,అధికారుల నుండి ఎట్టకేలకు జవాబు దొరికింది.తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నది, ప్రపంచానికే తలమానికంగా ఫోర్త్ సిటీ దేశానికి ఆదర్శవంతమైన గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటుంది. పర్యావరణహితమైన,అత్యాధునిక మౌలిక వసతులతో ఇది అద్భుతమైన భవిష్యత్ నగరంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది.కానీ విపక్షాలు ఈ 99 రోజుల్లో అసలు సమస్యల పై స్పందించకుండా రాజకీయ వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, ప్రజల దృష్టి మళ్లించడానికి సంచలన అంశాలు వెతుకుతూ డైవర్ట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేసింది.తెలంగాణ పునర్నిర్మాణంలో 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం రాష్ట్రం అభివృద్ధి పథం వైపు నడిపించడంలో ప్రజా ప్రభుత్వం తీసుకున్న మూడవ దఫా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక దోహదపడింది.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన,పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ పునరుజ్జీవం పథకం, భారత ఫ్యూచర్ సిటీ,యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెట్రో రైలు విస్తరణ ప్రణాళికలు , విమానాశ్రయాలు రీజనల్ రింగ్ రోడ్ వంటి అంశాలు క్రోడీకరించి, తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్ ప్రణాళిక ను సిద్ధం చేసుకొని వచ్చే పదేళ్లలో 3 ట్రిలియన్ ఎకనామిగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగడం ముదావహం.