“తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర రాజకీయ నాయకులకు మరియు ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద అధికారులకు మిగతా అధికారులు మాత్రం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, అవసరమైతే విదేశాలలో కానీ కార్పొరేట్ వైద్యం చేయించుకునే అవకాశం కల్పించుకుంటున్న విధంగా ఉద్యోగులను, పెన్షనర్లను ప్రభుత్వం ఎందుకు చూడడం లేదు? మా ఆరోగ్యం పట్ల వివక్షత ఎందుకు?. మీ ఆరోగ్యం మాత్రమే భద్రంగా ఉండాలి.కానీ ఉద్యోగ, పెన్షనర్ల ఆరోగ్యం భద్రత పట్ల మీకే మాత్రం శ్రద్ధ ఎందుకు లేదని పెన్షనర్లు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు..”

మొబైల్ : 9949937745
నగదు రహిత హెల్త్‌కార్డుల కోసం ప్రతిసారి చర్చలు జరుపడం, ఇస్తామనడం తప్ప గత ప్రభుత్వము నుండి ఈ ప్రభుత్వం వరకు ఎలాంటి పురోగతి లేదు. హెల్త్ కార్డులు మాత్రం నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో తప్ప ఎక్కడ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందడం లేదు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ.హెచ్.ఎస్. స్కీమ్ అమలుకు గత కేసిఆర్ ప్రభుత్వం జీఓ 186 జారీ చేసింది. అంతలోనే ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కార్ మార్గదర్శకాల జీఓ ఇచ్చి ఉద్యోగులు సర్కార్ వాటాను ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ లో జమ చేయడం, హెల్త్ కార్డులు ఇచ్చి వైద్యం అందించడం మాత్రమే మిగిలింది. ఈ రెండు పనుల కోసం రెండున్నర సంవత్సరాలు దాటినా ముందడుగు పడకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో నగదురహిత వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్ లో చెల్లుబాటు అయ్యే కార్డులను అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయనందున 2025 మే నెలలో మరియు సెప్టెంబర్ 1న ఉద్యోగ పెన్షనర్ల జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారంలో హెల్త్‌కార్డుల విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పింది. సరిగ్గా వారం గడిచాక ఈ పథకంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తీరా కొత్త కథను తెరపైకి తెచ్చారు. ఈ.హెచ్.ఎస్. స్కీమ్‌పై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక తెప్పించుకుంటామన్నారు. ఆ తర్వాత మంత్రుల సబ్ కమిటీ చర్చల్లోనూ హెల్త్‌కార్డులిస్తామన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో హెల్త్‌కార్డులకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. మే రెండో తేదీన స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ జేఏసీతో చర్చలు జరిపి నగదు రహిత వైద్యాన్ని జూన్ 1 నుండి అమలు చేస్తామని హామీ కూడా ఇచ్చి జూన్ 2 నుంచి హెల్త్‌కార్డులిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఉద్యోగ జేఏసీతో చర్చలు జరిపారు. ఇదే అంశంపై జూన్ 1న సాక్షాత్తు సీ.ఎం. రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. చివరికి జూన్ 2 నుండి అమలు చేస్తానన్న గడువు కూడా ముగిసింది.
13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జూన్ రెండు కూడా పూర్తి అయినది. ఇంత వరకు కార్డులు మాత్రం రాలేదు. చర్చలు జరిపి పది రోజులు దాటినా ఇప్పటివరకు ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయలేదు. నగదు రహిత కార్డులకు సంబంధించి విధివిధానాలు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఖరారు చేయలేదు. కానీ మే నెల ఉద్యోగుల వేతనాలు మరియు పెన్షనర్ల పెన్షన్ నుండి 1.5 శాతం కాంట్రిబ్యూషన్ హెల్త్ కార్డుల కొరకు ఉద్యోగ, పెన్షనర్ల అనుమతి లేకుండా అమౌంట్ కట్ చేశారు. ఈ విధంగా ఉద్యోగులు, పెన్షనర్ల నుండి కట్ చేసిన మొత్తం అమౌంట్ 528 కోట్లు అవుతుంది. కానీ ప్రభుత్వము కూడా అంతే అమౌంట్ అనగా 528 కోట్లు ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ కు సంబంధించిన అకౌంట్ లో జమ చేయాలి. కానీ ఆ విధంగా జరగలేదు. పెన్షనర్ల నుండి కట్ చేసిన అమౌంట్ పేస్లిప్ లో అగుపించడం లేదు. కట్ చేసిన అమౌంట్ పే స్లిప్ లో ఎందుకు చూపించడం లేదు.
ఇప్పటికీ ఈహెచ్ఎస్ పై అభ్యంతరాలు..ఈ.హెచ్.ఎస్. కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇతర పథకాలకు మళ్ళించకూడదు.జూనియర్ ఉద్యోగులకు మాత్రమే ఈ కార్డు లాభించనున్నది. సీనియర్లకు పెద్దగా ఉపయోగం లేదు. జూనియర్ల చెల్లింపు ప్రీమియం తక్కువగా ఉండగా, ఇంట్లో అర్హులైన అందరికీ హెల్త్‌కార్డు వర్తిస్తుంది. అదే రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్నవారు చెల్లించే ప్రీమియం అధికంగా ఉంటుంది. పెన్షనర్లకు, ఉద్యోగులకు కూడా భార్యభర్తలిద్దరికే వర్తిస్తుంది. ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5 శాతాన్ని ప్రీమియంగా వసూలు చేస్తున్నారు. దీనికి బదులుగా కుటుంబంపై ఆధారపడిన సభ్యుల సంఖ్యను బట్టి కాంట్రిబ్యూట్ నిర్ణయించాలన్నది కొందరు ఉద్యోగ సంఘాల వారి వాదన. 1.5 శాతం కోత విధిస్తే 25 సంవత్సరాలు దాటినా ఉద్యోగాలు రాని నిరుద్యోగులైన కుమారుల వయోపరిమితి 25 సంవత్సరాలు అనే నిబంధన ఉండకుండా చూడాలని కోరుతున్నారు.
భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనట్లయితే మరియు పెన్షనర్లు కూడా ఇద్దరూ పెన్షనర్లు అయినట్లయితే ఒక్కరి నుండే ప్రీమియం కట్ చేయాలి కానీ ఇద్దరి నుండి బేసిక్ లో 1.5 శాతం కట్ చేయడం అన్యాయం. కేంద్ర ప్రభుత్వంలో మూడంచెల విరాళాన్ని అమలు చేస్తున్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్‌తోపాటు ఆప్షన్ బేస్డ్ కాంట్రిబ్యూషన్ విధానాన్ని అనుసరించాలని కొందరు పేర్కొంటున్నారు. ఉచితంగా ఇచ్చే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.120 కోట్లున్నాయి. వీటిని చెల్లించాలని దవాఖానల యాజమాన్యాలు కోరుతున్నాయి. వీటిని చెల్లిస్తేనే ఈ.హెచ్.ఎస్.పై ముందడుగు పడే అవకాశమున్నది. ఈహెచ్ఎస్ స్కీం అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లలో చెల్లుబాటు అయ్యే విధంగా కార్పొరేట్ యాజమాన్యాలతో చర్చలు జరిపి కార్డులు అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఆరుగురు పెన్షనర్స్ ను ట్రస్ట్ లో నియమించాలి : పెన్షనర్స్ జేఏసీ డిమాండ్
ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టులో పెన్షనర్ల నుంచి ఆరుగురు ట్రస్టీలను నియమించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ స్కీమ్‌లో చేరాలా..? వద్దా ? అనే ఆప్షన్ కూడా ఇవ్వాలని, బలవంతంగా చేర్చరాదని పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కే. లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ,ఎ. రాజేంద్ర బాబు శనివారం సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. సంవత్సరానికి రెండుసార్లు ఔట్ పేషంట్ ట్రీట్‌మెంట్ కు అవకాశం కల్పించాలని, అవసరమైన మందులు ఇవ్వాలని, వైద్య పరీక్షలు కల్పించాలని, అవుట్ పేషెంట్ కు కూడా వైద్యానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు.
ఈ.హెచ్.ఎస్. కార్డులు అందని పరిస్థితి-నిశ్శబ్దంగా ఉన్న టీజీఇ జెఎసి
రెండ్రోజుల్లో ట్రస్టు ఏర్పాటు చేస్తామని చెప్పిన సర్కార్ పది రోజులలో ఈ.హెచ్.ఎస్. కార్డులు అమలు పరుస్తామని అధికారులు చెప్పినా, ఆఖరికి గడువు ముగిసినా ట్రస్టు ఏర్పాటు కాలేదనీ ..నెల ప్రీమియం చెల్లించినా వైద్యం అందని ఉద్యోగులు, పెన్షనర్లు హాస్పిటల్స్ లో హెల్త్ కార్డులు నెల ప్రీమియం చెల్లించినా అమలు అవడం లేదని నిజామాబాద్ జిల్లాలో మేడి క్యూర్ హాస్పిటల్ లో డీఈఓ ఆఫీస్ లో రిటైర్డ్ సూపరిండెంట్ గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో ఆదివారం జూన్ 7వ తేదీ హాస్పిటల్లో చేర్పిస్తే హెల్త్ కార్డు చెల్లడం లేదని వేలాది రూపాయలు వసూలు చేశారు. ఇలాంటి ఎన్నో కేసులు లక్షల్లో డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు బాధపడుతున్న విషయం గమనార్హం.
తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర రాజకీయ నాయకులకు మరియు ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద అధికారులకు మిగతా అధికారులు మాత్రం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, అవసరమైతే విదేశాలలో కానీ కార్పొరేట్ వైద్యం చేయించుకునే అవకాశం మీరు కల్పించుకుంటున్న విధంగా ఉద్యోగులను, పెన్షనర్లను ప్రభుత్వం ఎందుకు చూడడం లేదు? ఆరోగ్యం పట్ల వివక్షత ఎందుకు?. మీ ఆరోగ్యం మాత్రమే భద్రంగా ఉండాలి.కానీ ఉద్యోగ, పెన్షనర్ల ఆరోగ్యం భద్రత పట్ల మీకే మాత్రం శ్రద్ధ ఎందుకు లేదని పెన్షనర్లు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గం, ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపి ఈ నెలలోనే ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ను వెంటనే ఏర్పాటు చేసి, సభ్యులను నియమించి, పెన్షనర్ల నుండి ఆరుగురు సభ్యులను నియమించి, నగదు రహిత వైద్యానికి సంబంధించిన విధివిధానాలు వెంటనే ఖరారు చేసి, డిజిటల్ కార్డులను ఇప్పించి ఈ నెల నుండే అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లలో నగదు రహిత వైద్యం అందించే విధంగా ఈ.హెచ్.ఎస్. కార్డులను విడుదల చేయాలని లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. *కందుకూరి దేవదాసు
రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
మొబైల్ : 9949937745





