స‌మ‌గ్ర‌ సర్వే డేటా ఎంట్రీ కీలకమైనది.. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు..

  • డోర్ లాక్, వలస వెళ్ళిన వారి వివరాలు ఫోన్ కాల్ ద్వారా సేకరించాలి
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
  • సర్వే పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24 : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్ల‌కు ఆస్కారం ఇవ్వకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర్లు తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగారు జార్ఖండ్ రాజధాని నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సర్వే డేటా ఎంట్రీ లో నాణ్యత చాలా ముఖ్యమైందని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తేయి కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధీకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాలని తెలిపారు. కొన్ని వసతి గృహాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని, ఆయా పాఠశాలలో ఆహారం, పరిశుభ్రతపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకు సంబంధిత జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తకూడదనే మెస్, కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఎన్యుమారెటర్లు స్వయంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ల వద్ద ఉండి స్వయంగా ఎంట్రీ చేయించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా చేయించాలని ఏదైనా తేడా వచ్చినట్లు అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలలో స్టిక్కరింగ్ వేసి సర్వేకు వచ్చిన సమయంలో ఏదేని కారణాలచే ఇంటి సర్వేకు రాలేదు అని భావించిన వారు ఆయా గ్రామ పంచాయతీ సెక్రటరీని సంప్రదించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో సీపీవో గోవింద రాజన్, జడ్పీ సీఈవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page