వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్, ప్రజాతంత్ర : హార్వెస్టెర్ ద్వారానే రైతులు వరికోతలు చేస్తున్నందున హార్వెస్టర్ బ్లోయర్ స్పీడ్ 18-20 RPM ఉండే విధంగా వాటి యజమానులు చూసుకుంటే తాలు, చెత్త పోయి కొనుగోలు కేంద్రాల వద్దకు నాణ్యమైన వడ్లు వొస్తాయని ఫలితంగా రైతులకు మంచి ధర (రూ.2830) వస్తుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి గీసుగొండ మండలకేంద్రంలో పాకనాటి సురేష్ వ్యవసాయ క్షేత్రంలో కంబైన్డ్ హార్వెస్టర్ తో కోస్తున్న వరి పంటను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు.
రైతులు కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి రాకుండా ఒక క్రమపద్దతి పాటిచాలని, పీపీసీ నిర్వాహకులు ప్యాడీ క్లీనర్లతో శుభ్రపరిచిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించే విధంగా రైతులు, ఏఈవోలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం పీఏసీఎస్‌లు, గీసుగొండ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాట్లను పరిశీలించారు.
పత్తి తీస్తున్న రైతులతో మాట్లాడారు. తేమశాతం 8-12 ఉన్న ప్రత్తిని లూజ్ గా మార్కెట్ కు తరలించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. అనంతరం పక్కనే ఉన్న బంతి, మునగ తోటలను కూడా పరిశీలించారు. రైతులు కూరగాయల తోటలు పండిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చు అన్నారు. దగ్గరలోనే వరంగల్ నగరం ఉన్నందున డిమాండ్ ను బట్టి కూరగాయల సాగు చేపట్టాలని చెప్పారు. రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటలు పండించడం కాకుండా విభిన్న పంటల సాగు చేస్తే నేల సారం బాగుపడటమే కాకుండా మంచి లాభాలు కూడా పొందవచ్చన్నారు.
విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి ఆహారం కీలకం
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్/గీసుగొండ/సంగెం నవంబర్ 24 : విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తీసుకునే ఆహారం ముఖ్య భూమిక పోషిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్య శారద అన్నారు. పీఎం ఫొషన్ అభియాన్ లో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి అధ్వర్యంలో జిల్లా స్థాయిలో మధ్యాహ్న భోజన వంటవారికి “వంటల పోటీలు” ఆదివారం గీసుగొండ మండలంలోని వంచనగిరి కస్తూర్భా గాంధీ పాఠశాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో పౌష్టిక ఆహారం అందించేందుకు వంటవారు సరైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వంటచేసే వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు సరైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వంచనగిరి కస్తూర్భా గాంధీ పాఠశాలలో వంటగదిని, వంట సరుకులను పరిశీలించి తగు సూచనలు చేశారు. అదే విదంగా విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటె సంకోచించకుండా పై అధికారులకు తెలియజేయాలన్నారు. జిల్లాలోని 13 మండలాల నుండి విచ్చేసిన వంటవారు వండిన వంటలను రుచి చూసి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసారు.
రుచికరంగా వంట చేసిన వారిలో మొదటి బహుమతి ఖానాపూర్ మండలానికి చెందిన సుశీలకు, రెండవ బహుమతి గీసుగొండ మండలానికి చెందిన రేణుకకు; మూడవ బహుమతి నల్లబెల్లి మండలానికి చెందిన స్వప్నకు లభించింది. న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రీలత, ప్రధానోపాధ్యాయులు నర్సింహా చార్యులు వ్యవహరించిన ఈ కార్యక్రమానికి డీఈవో మామిడి జ్ఞానేశ్వర్ అధ్యక్షత వహించగా, ఫుడ్ ఇన్ స్పెక్టర్ కృష్ణమూర్తి, కోఆర్డినేటర్ ఫ్లోరెన్స్, డిసిఈబి సెక్రటరీ కృష్ణమూర్తి, స్థానిక స్పెషల్ ఆఫీసర్ హిమబిందు, నిరంజన్ రెడ్డి వివిధ మండలాల నుండి మండల విద్యాదికారులు పాల్గొనున్నారు.
అనంతరం. వంచనగిరి కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని, సంగెంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని, కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల పరిసరాలను పరిశీలించారు పరిశుభ్రతను పాటించాలన్నారు. పిల్లల చదువుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చదువుతోనే , సమాజంలో గౌరవమని అన్నారు. ఆయా వసతి గృహాల్లో ఫిర్యాదుల పెట్టెలోని ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశించారు.