వరంగల్ లో పోలీసు నిర్భంధం ఎందుకు ?

ప్రొఫెసర్ సాయిబాబా సభలో వేణుగోపాల్

కాళోజీ జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర, నవంబరు 24: తెలుగు రాష్ట్రాలలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంస్మరణ సభలు ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో జరుపుకునే అనుమతిస్తుంటే కేవలం వరంగల్ లోనే పోలీసులు ఎందుకు నిర్బంధపు అవాంతరాలు సృష్టిస్తున్నారని వీక్షణం ఎడిటర్‌ ఎన్. వేణుగోపాల్ ప్రశ్నించారు. ఆదివారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభకు గంట రామిరెడ్డి అధ్యక్షత వహించిగా ప్రధాన వక్తగా వేణుగోపాల్ పాల్గొని ప్రసంగించారు. ప్రజలవైపు నిలబడిన కవులు, రచయితలు, కళాకారులను అక్రమ కేసులతో నిర్బంధాలకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాయిబాబాను బతికి ఉన్నపుడే కాకుండా చనిపోయిన అతని సంస్మరణ సభలకు అవాంతరాలను కలిగించడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హాల్ లో సభను జరుపుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుంటే పోలీసుల అనుమతి లభించని అదృశ్య అవాంతారాలు కల్పించడం ప్రజాపాలన కాదని స్పష్టం చేశారు. గతంలో వరంగల్ ప్రొఫెసర్ సాయిబాబా కవిత్వాన్ని కూడా ఆవిష్కరణ చేయకుండా 2018లో పోలీసులు ప్రెస్ క్లబ్ కు తాళం వేసి భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నారని గుర్తుచేశారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధన తీర్మానం చేయడంలో వరంగల్ లో జరిగిన సభలో ప్రొఫెసర్ సాయిబాబా కీలకంగా పని చేశారని చెప్పారు. సాయిబాబా అక్రమ కుట్ర కేసులపై ప్రపంచ వ్యాప్తంగా వివిధ దెశాలు, సంస్థల నుండి తీవ్రమైన నిరసనలు వచ్చాయని తెలిపారు. దేశంలో కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిన పాలవర్గాల చర్యలను సాయిబాబా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకు వెళ్లారని అన్నారు. దేశీయ సంపదలను కొల్లగొడుతున్న కార్పొరేట్లను వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆదివాసీ గిరిజనులకు అండగా సాయిబాబా నిలబడ్డారని పేర్కొన్నారు. టిపిఎఫ్ కన్వీనర్‌ రవిచందర్ మాట్లాడుతూ దేశంలో ఫాసిస్టుల పాలన సాగుతుందని హెచ్చరించారు. నియంతృత్వ పాలనలో ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా ప్రజల హక్కుల కోసం మాట్లాడటం వల్లనే ఆయన్ను ప్రజలు స్మరించుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, మెట్టు రవిందర్, డాక్టర్ వెంగళ్ రెడ్డి, సోమయ్య, వీరస్వామి, అప్పారావు, రవి, కుమార్, గంగాధర్, వీరస్వామి, డాక్టర్ నారాయణ, చందు తదితరులు పాల్గొన్నారు.

సాయిబాబా యాదిలో పాట ఆవిష్కరణ

కాళోజీ జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర, నవంబరు 24: ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంస్మరణ సభలో విరసం సభ్యుడు శాకమూరు రవి రచించిన సాయి సారుకు జోహార్లు…సాయిబాబా జోహార్లు…పాటను హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా శాక‌మూరు రవి రాసిన మరో దీర్ఘ కవితను కూడా ఆవిష్క‌రించారు. మేధావిగా ప్రొఫెసర్ సాయిబాబా పోరాటం కవులు, రచయితలను ఆలోచింప చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం లో సాయిబాబా కుమార్తె జి.మంజీరా, ఎన్.వేణుగోపాల్, డాక్టర్ వెంగళ రెడ్డి, గంట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page