అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సన్నద్ధం

ఆ లోపే మంత్రివర్గ మార్పులు, విస్తరణ?
ప్రత్యర్థులపై దాడికి కత్తులు నూరుతున్న విపక్షాలు

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి )

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్‌ 7‌కు ఏడాది కావస్తుండడంతో, ఈ సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, చేపట్టనున్న పథకాలపై వివరించేందుకు డిసెంబర్‌ 9 ‌నుంచి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల పేర్కొన్నారు. దీంతో ఇంతకాలం తమపై మాటల దాడులు చేస్తున్న ప్రభుత్వ పనితీరును ఎండగట్టెందుకు విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. దీంతో ఈ శీతాకాల సమావేశాలు వేడెక్కించేవిగా ఉంటాయనుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో లగచర్ల ఘటన మంటలు లేపుతోంది. ఈ ఘటనకు కారకులు మీరంటే.. మీరని అధికార కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌లు ఆరోపించుకుంటుండగా, ఈ ఘటన దురదృష్టకరమని బిజెపి అంటోంది. లగచర్ల ఫార్మా మంటలకు బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి, ఎమ్మెల్యే  కేటీఆరే సూత్రధారి అని అధికార కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. అయితే
అవి కాంగ్రెస్‌ ‌లేపిన మంటలేనని బిఆర్‌ఎస్‌ ‌వర్గాలు ప్రతిదాడి చేస్తున్నాయి. మొత్తం మీద ఈ వివాదం దిల్లీకి చేరడంతో ఇప్పుడిది హాట్‌ ‌టాపిక్‌గా మారింది. ఫార్మా కంపెనీకి తమ భూములు ఇవ్వమన్న గిరిజనులపై జరిగిన దాడి, వారిపై మోపిన కేసులు, అమాయకుల అరెస్టుల సంఘటనకు సంబంధిచిన చర్చ అసెంబ్లీ సమావేశాల్లో కుదిపేయనున్నాయి.

దీనికితోపాటు మూసీ సుందరీకరణ, హైడ్రాపై ఘాటుగా చర్చలు జరిగే అవకాశముంది. ఇవన్నీ ఒకఎత్తు కాగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపైనకూడా వాడీగావేడీగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆరు గ్యారంటీల విషయంలో బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలతో పాటు కాంగ్రెస్‌ ‌మిత్రపక్షాలుకూడా నిలదీస్తున్న క్రమంలో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని  ఎదుర్కోవాల్సిఉంది. హామీ ఇచ్చిన మేరకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాట నిలుపుకోకపోవడంతో నిరసన కార్యక్రమానికి ఇప్పటికే బిజెపి ప్రణాళికను రూపొందించుకుంది. వాస్తవంగా అసెంబ్లీ సమావేశాలకు ముందే డిసెంబర్‌ ఒకటి నుంచి 5వ  తేదీ వరకు నిరసన పాదయాత్రలు చేయాలని తలపెట్టింది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ఎలా  విఫలమైందన్న విషయాన్ని ఈ పాదయాత్రల ద్వారా ప్రజలకు వివరించేందుకు ఆ పార్టీ సిద్దమైంది. అయితే అనుకోకుండా తాజాగా కార్యక్రమంలో మార్పులు చేసుకున్నట్లు తెలుస్తున్నది.

పాదయాత్రల బదులుగా మండల స్థాయిలో బైక్‌ ‌ర్యాలీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిరసనస కార్యక్రమాలు, భారీ బహిరంగ సమావేశాల ద్వారా అధికార పార్టీని ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. చివరకు కాంగ్రెస్‌ ‌వైఫల్యాలపై ఛార్జిషీటు విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా మూసీ ప్రక్షాళన పేర కాంగ్రెస్‌ ‌నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బిజెపి ‘మూసీ నిద్ర’ పేరుతో మూసీ మురికి ప్రాంతాల్లో ఒకరోజు పడుకోవడం ద్వారా బిజెపి నేతలు తమ నిరసనను తెలియజేశారు. బిఆర్‌ఎస్‌ ‌కూడా అధికారపార్టీని ఎండగట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నది. ఎన్నికలకు ముందు ఎంతటివారైనా తప్పుచేస్తే శిక్షించడానికి వెనుకాడమని చెప్పిన రేవంత్‌రెడ్డి, అమృత్‌ ‌పథకంకింద అర్హతలేకున్నా బావమర్దికి కాంట్రాక్టు ఇవ్వడాన్ని అసెంబ్లీలో చర్చకు తీసుకువొచ్చేందుకు బిఆర్‌ఎస్‌ ‌సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకుపోయినా తీసుకున్న చర్యలేవీ లేకపోవడంతో అసెంబ్లీలో అధారాలతోసహా చర్చకు పెట్టే అవకాశాలున్నాయనుకుంటున్నారు. అలాగే రైతు బరోసా, మహిళలకు ఇస్తానన్న పెన్షన్‌ ‌తదితర అంశాలపై బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పట్టుబట్టే అవకాశముంది.

ఇదిలాఉంటే అసెంబ్లీ సమావేశాలలోపే మంత్రివర్గ విస్తీర్ణ, మంత్రుల శాఖల మార్పు జరుగవచ్చనుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి మంత్రివర్గమే తప్ప గడచిన ఏడాది కాలంగా మళ్లీ విస్తరణ జరుగలేదు. విస్తరణ విషయం అనేకసార్లు వాయిదా పడుతూ వొస్తున్నది. సంవత్సరం కావొస్తున్నా కొత్త మంత్రులను తీసుకోలేదన్న నింద రాకుండా డిసెంబర్‌ 7‌వ తేదీలోపే మంత్రి వర్గాన్ని ప్రభుత్వం విస్తరించవచ్చని భావిస్తున్నారు. కొత్తగా ఆరుగురిని మంత్రులుగా తీసుకునే అవకాశముంది.  అందుకు  పోటీ కూడా తీవ్రతరంగానే ఉంది. ముఖ్యంగా మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యంలేని జిల్లాల నుంచి వీరిని ఎంచుకునే అవకాశముంది. మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఆదిలాబాద్‌ ‌నుంచి ప్రేమ్‌సాగర్‌, ‌గడ్డం వివేక్‌, ‌గడ్డం వినోద్‌లున్నారు. అలాగే నిజామాబాద్‌ ‌నుంచి సుదర్శన్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావు, మహబూబ్‌నగర్‌ ‌నుంచి వాకిటి శ్రీహరి, ఎస్టీ కోటాలో బాలూనాయక్‌, ‌నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page