మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం..
అదానితో రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు
ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 22: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక మద్దతు ధరల లేక పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తిని రూ.7,500కు కొనుగోలు చేయాలన్నారు. ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం ఖమ్మం పత్తి మార్కెట్ ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మం పత్తి మార్కెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేశారని, కనీసం మద్దతు ధర వొచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదని, అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉందన్నారు. రైతులను, వ్యవసాయ కూలీలను, అసలు ఏ ఒక్క వర్గాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వొచ్చిందని, పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే అందిస్తున్నారని, ఇవి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇచ్చిన లెక్కలేనని స్పష్టం చేశారు. ఖమ్మం పత్తి మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
శంకర్ రమాదేవి అనే రైతులు 8 ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం 5 క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వొచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు దలారుల దోపిడీ వల్లే కాంగ్రెస్ ప్రభుత్వంలో పత్తి ధర సగానికి సగం పడిపోయిందని ఆరోపించారు. పత్తి రైతులకు రూ.7,520 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. దలారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు. మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వొస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు.
రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసా, కౌలు రైతులకు రూ.15,000 ఇస్తామని, రైతు కూలీలకు రూ.12,000 ఇస్తామని మోసం చేశారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదు. ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాడడమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక రైతుకైనా సన్న వడ్లకు బోనస్ వొచ్చిందా అని ప్రశ్నించారు. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దలారుల పాలైంది. సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, ఎక్కడా సీసీఐ కేంద్రాలు కనబడడం లేదు. పత్తి సీసీఐ కేంద్రాల్లో 7,000 మెట్రిక్ టన్నులు కొంటే, మార్కెట్లో 15,000 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు జరిగింది. ముఖ్యమంత్రి మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు తప్ప.. కానీ పత్తి వరి కొనుగోళ్లపై చేయడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికి మెమోలు జారీ చేయడం లేదు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని హరీష్ రావు విమర్శించారు..
రైతుల కుటుంబానికి హరీష్ రావు పరామర్శ
ఖమ్మం జిల్లా చింతకాని మండల ప్రొద్దుటూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బొజ్యాండ్ల ప్రభాకర్ అనే రైతు కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభాకర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున హామీ ఇచ్చారు. అలాగే చింతకాని మండలం లచాగూడెంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన గోని ప్రసాద్ కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి , బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఖమ్మం మార్కెట్ యార్డులో వెళ్ళినప్పుడు రైతులందరూ కన్నీరుపెట్టుకొని బాధపడుతున్నారని,మళ్లీ కెసిఆర్ సార్ ప్రభుత్వమే రావాలని ఖమ్మం రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. మార్పు.. మార్పు అని ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం మార్పు వచ్చింది? రైతుబంధు బంద్ అయింది. బతుకమ్మ చీరలు బంద్, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్, కెసిఆర్ కిట్, దళిత బంధు బంద్ అయింది.గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు, బీసీ బంధు బంద్ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి హామీ మహిళలకు రూ.2500 ఇస్తామని గ్యారెంటీ ఇచ్చారు. భట్టి విక్రమార్క ఇంటింటికి బాండ్ పేపర్ మీద రాసి హామీ ఇచ్చాడు. ఈ 11 నెలల్లో ఒక్కొక్క మహిళకు రూ.27500 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది. మహిళల వోట్లు దండుకొని మోసం చేశారు. కల్యాణ లక్ష్మి రూ.లక్షతో పాటు తులం బంగారం అని మోసం చేశారు. బతుకమ్మ చీరలు ఒకటి కాదు రెండు ఇస్తామని మోసం చేశారు.
గత 11 నెలల్లో తెలంగాణలో 6 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల తులాల బంగారం బాకీ పడిందన్నారు. ఉచిత బస్సు తప్ప అంతా తుస్సేనని హరీష్ రావు ఎద్దేవా చేశారు. బస్సు సర్వీసులు తగ్గించి ఆడబిడ్డలను ఇబ్బంది పెడుతున్నారని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని దేవుని మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఏ ముఖ్యమంత్రి అయినా దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పుతారా? అని ప్రశ్నించారు. తాను దేవాలయాలకు వెళ్లి రేవంత్ రెడ్డి మోసానికి పాపపరిహారం చేశానని తెలిపారు. అదానీ గురించి దిల్లీ కాంగ్రెస్ ఒక మాట.. గల్లీ కాంగ్రెస్ ఒక మాట మాట్లాడుతోంది. రాహుల్ గాంధీ.. ఆదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ అదానీ నుంచి రూ.100 కోట్ల చెక్కు తీసుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. అంతర్గత ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తోందని అన్నారు. కెసిఆర్ ఉన్నప్పుడు ఆదానీ అనేవాడు తెలంగాణకు రాగలిగాడా? ఒక రూపాయి అయినా తెలంగాణలో పెట్టుబడి పెట్టగలిగాడా? అవినీతి ఆరోపణలతో అమెరికాలో అదానిని అరెస్టు చేయాలని చూస్తున్నారు. అలాంటి అదానితో రేవంత్ రెడ్డి.లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌కు మూడు దిక్కులా సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి.. నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రికి అలవాటని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి అమలు చేస్తానన్న ఆరు గారెంటీలు ఒకటైన అమలు అయ్యాయా? అని ప్రశ్నించారు. గ్యారెంటీలు అమలు చేయనందుకు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. కరోనా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి రైతులకు రైతుబంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమని కొనియాడారు. రూ.15000 రైతుబంధు ఇస్తామని ఉన్న రూ.10000 కూడా ఎగ్గొట్టాడని అన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. హామీలను ఎగ్గొట్టినందుకు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలవాలన్నారు.
రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తే ఆ దురాగతాలను తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ప్రభాకర్ కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ఈ ఆత్మహత్య ముమ్మాటికీ కాంగ్రెస్ చేసిన హత్యేనని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న భట్టి తన నియోజకవర్గంలో విద్యుత్ షాక్ తో మరణించిన రైతుకి న్యాయం చేయమని అడిగితే తప్పా? అని ప్రశ్నించారు. కరెంట్ షాక్ తో మరణించిన ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని పుల్లయ్య అడిగితే వారిపై కేసు పెట్టారన్నారు.
సోషల్ మీడియాలో పోస్ట్లు పెడితే అక్రమ అరెస్టు చేస్తారు. చనిపోయిన రైతుకు న్యాయం చేయాలని అడిగిన పుల్లయ్యను కేసు పెట్టి అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఉత్సాహం చూపిన పోలీసులకు ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుందన్నారు. పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి, ఏ పార్టీకి తొత్తులుగా వ్యవహరించొద్దన్నారు. అక్రమంగా తమ కార్యకర్తలపై కేసులు పెడితే పోలీసులు ఎంక్వయిరీలు ఎదుర్కోక తప్పదని చెప్పారు. చింతకాని మండలానికి ఎంతో ప్రేమతో కేసీఆర్ దళిత బందును ప్రకటించారు. 3200 మందికి దళిత బంధు అకౌంట్ ఓపెన్ చేసి చాలావరకు దళిత బంధు డబ్బులు అందించారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీకు అండగా పార్టీ ఉంది మళ్లీ వొచ్చేది మన ప్రభుత్వమే. మళ్లీ కేసిఆర్ ఏ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం. అని హరీష్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.