సన్నాలకు రూ.500 బోనస్‌ ‌విడుదల

రైతుల ఖాతల్లోకి నేరుగా జమ
రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్ 22: ‌సన్నాలు  పండించిన అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్‌ ‌డబ్బులు జమవుతున్నాయి. శుక్రవారం పలు జిల్లాల రైతుల ఖాతాల్లో బోనస్‌ ‌డబ్బులు జమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెస్సేజ్‌ ‌లు రైతుల మొబైల్‌ ‌ఫోన్లకు వొస్తున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో సన్న రకాల ధాన్యం మార్కెట్లోకి పోటెత్తుతోంది. ఈ వానాకాలం సీజన్‌లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతానికి భిన్నంగా దొడ్డు రకాల సాగు తగ్గి, సన్నాల సాగు పెరిగింది. సన్నాలకు సర్కార్‌ ‌రూ.500 బోనస్‌ ‌ప్రకటించడంతో వీటి సాగు గతంతో పోలిస్తే ఏకంగా 61శాతం పెరిగింది.  పోయినేడు వానాకాలంలో వరి సాగు విస్తీర్ణంలో సన్నాల వాటా 25.05 లక్షల ఎకరాలు (38) ఉంటే.. ఈ సారి అది 40.44 లక్షల ఎకరాలకు పెరిగింది. గత ఏడాది వానాకాలంలో 40.89 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగైతే, ఈసారి అది 26.33 లక్షల ఎకరాలకు తగ్గింది. సాగు గణనీయంగా పెరగడంతో దిగుబడిలోనూ సన్న ధాన్యం రికార్డులు సృష్టిస్తోంది. ఈ యేడు సన్న వడ్ల దిగుబడి దాదాపు 93.33 లక్షల టన్నులు ఉంటుందని  సర్కారు అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు ఏ మిల్లు చూసినా, ఏ కొనుగోలు సెంటర్‌ ‌చూసినా సన్న వడ్ల రాసులే కనిపిస్తున్నాయి.
సన్నవడ్ల కొనుగోలు కోసం ప్రభుత్వం 7,500 సెంటర్లు ఏర్పాటు చేసింది సర్కార్‌. ‌కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్‌ ఇస్తోంది ప్రభుత్వం. ఖాతాల్లో ధాన్యం సొమ్ముతో పాటు బోనస్‌ ‌కూడా జమ అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పలువురు రైతులకు సన్నాల బోనస్‌ ‌మెస్సేజ్‌ ‌లు వొచ్చాయి. ఉమ్మడి కరీంనగర్‌  ‌జిల్లా కోరుట్ల కు  చెందిన ఓ రైతు 46 క్వింటాళ్ల 800 గ్రాముల ధాన్యం విక్రయించగా.. 23,400 రూపాయల బోనస్‌ ‌మొత్తం తెలంగాణ గ్రాణ బ్యాంకులోని ఆయన ఖాతాలో జమైనట్లు మెస్సేజ్ ‌వొచ్చింది. బాదావత్‌ ‌నరేశ్‌, ‌హాతియా తండా, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా నామూడెకరాల్లో పండిన వడ్లను పాలేరు ఐకేపీ సెంటర్‌ ‌లో మూడు రోజుల కిందట కాంటా వేశారు. 59 క్వింటాళ్ల 20 కేజీలు అయ్యాయి. వాటికి సంబంధించిన డబ్బులు లక్షా 37 వేల 344 రూపాయలు వొచ్చాయి. కనీస మద్దతు ధర 2,320 చొప్పున కొనుగోలు చేశారు. ఈ డబ్బులను నా ఖాతాలో ప్రభుత్వం వేసింది. వడ్లకు సంబంధించిన బోనస్‌ ‌కూడా నిన్న సాయంత్రం మా ఖాతాల్లో వేసింది. నాకు 29,600 బోనస్‌ ‌సొమ్ము వొచ్చాయి అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page