- హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకునేలా కేటాయింపులు
- కెసిఆర్ హయాంలో ఇలా ఎప్పుడైనా చూశామా
- బడ్జెట్‌పై విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అద్భుతంగా, అభివృద్దిని సాధించేదిగా, రైతాంగాన్ని ఆదుకునేదిగా ఉందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అలాగే రాజధాని హైదరాబాద్ అభివృద్దిపై ఇంతగా గతంలో ఎవరు కూడా దృష్టి పెట్టలేదని అన్నారు. అయితే బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై హస్తం నేతలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్‌కు ఎన్ని నిధులు ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విూడియాతో మాట్లాడుతూ… తెలంగాణ అసెంబ్లీ నిన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు. బడ్జెట్ లోహైదరాబాద్కు భారీ నిధులు కేటాయించారన్నారు. హైదరాబాద్ సేఫ్‌గా ఉండాలని కోరుతూ నిధులు ఇచ్చారని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలే, వాటర్ బోర్డు, మెట్రోలకు, హైడ్రాకు నిధులు ఇచ్చారని తెలిపారు. వ్యూహాత్మకంగానే జంటనగరాల అభివృద్ధికి నిధులు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లో వర్షాలు వస్తే కేసీఆర్ హయాంలో ఫామ్ హౌస్‌లో కూర్చొని మొసలి కన్నీరు పెట్టారని విమర్శించారు. పిట్ట కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అంటూ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి దగ్గరలో బడ్జెట్ ఉందన్నారు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తా, మూసి నదిలో ఈతకొట్టేలా చేస్తా అని గప్పాలు కొట్టిండు అని అన్నారు. ఓల్డ్ సిటీ లో మౌలిక వసతులు లేవని తెలిపారు. మెట్రో విస్తరణకు నిధులు ఇచ్చారన్నారు. రూరల్ ప్రాంతంతో పాటు రాజధాని హైదరాబాద్ కోసం భారీగా నిధులు కేటాయించారని చెప్పారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ చదువుతుంటే కేసీఆర్ బయటికొచ్చి విమర్శలు చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ పదేళ్ల కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అమ్మడంపైనే, అప్పులు చేయడంపైనే ఫోకస్ చేశారన్నారు. ఎవరైనా భూములు అమ్మాలన్నా, అప్పులు చేయాలన్నా ఆయన వద్ద నేర్చుకోండని ఎద్దేవా చేశారు. పత్తాలు ఆడడం మాకు రావు, బీఆర్ఎస్.. బీజేపీ వాళ్ళకే వస్తాయ్ అంటూ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై గట్టిగానే విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ప్రజలు చీల్చి చండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక ఏడు సీట్లలో డిపాజిట్ కోల్పోయారని వ్యాఖ్యలు చేశారు.ఎనిమిది నెలలు ఇంట్లో ఉండి మధ్యలో రెండుసార్లు అసెంబ్లీ నడిచినా రాలేదని అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో తెలంగాణ రాష్టాన్రికి వ్యవసాయ రంగానికి 72 వేల కోట్లు కాంగ్రెస్ కేటాయించిందని చెప్పుకొచ్చారు. నువ్వు ఏనాడైనా పెట్టావా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేసేలా కేంద్రం ఘోరంగా బడ్జెట్ పెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదని నిలదీశారు.