- కవిత, కెటిఆర్ ఫామ్ హౌజ్‌లు కూల్చడానికి వెనకడుగు ఎందుకు
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందని ఆరోపించారు. విడియాతో ఆయన మాట్లాడుతూ.. హైడ్రామాకు భాగ్యనగరం కేరాఫ్‌గా మారింది. నిర్మాణాలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారే నేడు అక్రమ కట్టడాలని కూల్చేస్తూ డ్రామాలాడుతున్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు? విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయాలు ఎలా కల్పించారు? ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి. ఇష్టం వచ్చినట్లు చేస్తామనడం సరికాదు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ చెబుతోందని.. అదే నిజం అయితే ముందు బీఆర్ఎస్ నేతలు ఆక్రమించి కట్టిన భవనాలను కూల్చివేయాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్‌లు కూల్చడానికి ఎందుకు వెనకాడుతున్నారో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి భయపడుతున్నారని ఎంపీ రఘునందన్ విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కబ్జాలు పెరిగాయని, కేసీఆర్ హయాంలో ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ••ందుగా జన్వాడలో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫామ్ హౌస్ కూల్చి వేయాలంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కబ్జాలు చేసిన నేతలపై కేసులు పెట్టామని అధికార పార్టీ నేతలు చెప్తున్నారని, అదే నిజమైతే వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఎంపీ ప్రశ్నించారు.
మెట్రో పెయిడ్ పార్కింగ్‌పై వెనకడుగు
మహాధర్నా పిలుపుతో నిర్ణయాన్ని వాయిదా వేసిన యాజమాన్యం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : మెట్రో స్టేషన్ల దగ్గర పెయిడ్ పార్కింగ్ అమలుపై ఇటీవలే మెట్రో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫ్రీ పార్కింగ్ ను ఎత్తేసి సెప్టెంబర్ 1నుండి పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మెట్రో అధికారుల నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది.
మెట్రోస్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయడంపై మెట్రో అధికారులు మరోసారి వెనక్కి తగ్గారు. పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 25న మహాధర్నాకు పిలుపునిచ్చారు మెట్రో ప్రయాణికులు. ఈ క్రమంలో పెయిడ్ పార్కింగ్ నిర్ణయంపై మెట్రో అధికారులు వెనక్కి తగ్గారు.ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు పెయిడ్ పార్కింగ్ అమలును వాయిదా వేస్తున్నట్లు, తదుపరి నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని ఎల్ అండ్ టీ మెట్రో ప్రకటించింది.