తీర్మానానికి శాసన సభ ఆమోదం
కేంద్రం తీరు, తదితర అంశాలపై వాడీవేడీగా చర్చ
నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నట్లు సిఎం రేవంత్ ప్రకటన
తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి వాకౌట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించిన అసెంబ్లీ కేందరం తీరును నిరసిస్తూ ..ఏకగ్రీవంగా తీర్మానానికి బుధవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ’కేంద్ర బ్జడెట్‌లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు ఈ తీర్మానంపై తమ అభిప్రాయాలను తెలిపాయి. బీజేపీ మాత్రమే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణపట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తీర్మానంలో పేర్కొన్నారు. బడ్జెట్‌ను సవరించి తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఈ తీర్మానం ద్వారా కేంద్రాన్ని శాసనసభ కోరింది.
ఎన్నోమార్లు దిల్లీ వెళ్లి ప్రధానిని, మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చామని సిఎం అన్నారు. ప్రధానిని ఎన్నో అడిగాం.. ఒక్కటీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రతిపాదనలు కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ దేశంలో భాగం కాదా? ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించిందన్నారు. కేంద్రం తీరుతో రాష్ట్రాలన్నీ ఆలోచనలో పడ్డాయన్నారు. తెలంగాణను కేంద్రం గాలికి వదిలేసిందన్నారు. ఈ క్రమంలో నిరసనలో భాగంగా నెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా తొలి నిరసన తెలియ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదన్నారు.
రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేశామని, తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని ఇతర సీఎంలు కూడా బరిష్కరించారని, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌వీందర్ సింగ్ సుఖు నీతి ఆయోగ్ విూటింగ్‌కు హాజరు కావడం లేదన్నారు. కాగా తమ పార్టీ ముఖ్యమంత్రులు ముగ్గురు ఈ సమావేశానికి హాజరు కారని కాంగ్రెస్ దిల్లీలో ప్రకటించింది. అయితే బడ్జెట్‌లో కేంద్రం చూపిన వైఖరిపై బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. వారు నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజర్ అయ్యే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంతకుముందు రాష్ట్ర ప్రయోజనాలకోసం అందరం కలిసి పోరాడుదామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసి కేంద్రంతో పోరాటం చేద్దామన్నారు. తాము ప్రవేశపెట్టిన చర్చకు ప్రతిపక్షాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్టాన్రికి అన్యాయం జరిగినందుకే తమకు బాధగా ఉందని చెప్పారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని, మూసీ ప్రక్షాళనకు నిధులు కావాలని అడిగామని అన్నారు. తాము పెట్టిన చర్చకు విపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో మండలిలో ఫ్లోర్ లీడర్ గా పనిచేశారని, మాజీ మంత్రి కేటీఆర్ సీఎంపై మాట్లాడిన తీరు బాగాలేదని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వాలని భట్టి కోరారు.