తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇదిలా ఉండగా పీసీసీ చీఫ్ పదవికి మధుయాష్కీ గౌడ్, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గా రెడ్డి, అద్దంకి దయాకర్ పోటీ పడ్డారు. కానీ వీరందరిలో చివరకు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మహేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం (TPCC President) దక్కింది. పీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై రెండు వారాల క్రితమే కసరత్తు జరగగా, కాంగ్రెస్ పార్టీ నేడు అధికారికంగా ప్రకటించింది.
మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ నేపథ్యం ఇదీ ..
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అనంతరం 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చవిచూశారు.మహేష్ కుమార్ 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు.మహేష్ కుమార్ 2018 లో రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు.2021 జూన్ 26న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా పనిచేశారు.
2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియామకమయ్యారు.2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించినా ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. 2024 జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం చేశారు.