కాంగ్రెస్‌లోకి స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా

హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం
అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అనంతరం సీనియర్‌ ‌నేతల సమక్షంలో చేరిక

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 6 : ‌భారత స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా శుక్రవారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ ‌నేతల సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు వారు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. పార్టీలో చేరడానికంటే ముందే…రెండు రోజుల క్రితమే భారత రైల్వేలో తమ ఉద్యోగాలకు వినేశ్‌, ‌పునియా రాజీనామా చేశారు. కాగా హరియాణాలో ఎన్నికలు జరుగనున్న వేళ ఆ రాష్ట్రానికే చెందిన వీరు వీరు కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరినట్లయింది. ఇదిలా ఉంటే హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ ‌కేంద్ర ఎన్నికల కమిటీ ఇటీవల భేటీ అయ్యింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చ జరిపిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజ్‌రంగ్‌ ‌పునియా కాంగ్రెస్‌ ఎం‌పీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీతో భేటీ అయ్యారు.

ఆ ఫొటోను కాంగ్రెస్‌ ‌పార్టీ తమ ’ఎక్స్’ ‌ఖాతాలో షేర్‌ ‌చేసింది. దాంతో వారు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమంటూ వొచ్చిన వార్తలు.. ఇప్పుడు వాస్తవ రూపం దాల్చాయి. కాగా నేడో, రేపో కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి. అందులో వీరికి టికెట్లు దక్కే సంకేతాలు కన్పిస్తున్నాయి. అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో స్టార్‌ ‌రెజ్లర్‌ ‌వినేశ్‌ ‌ఫొగాట్‌ ఒలింపిక్స్ ‌కల చెదిరింది. దాంతో ఆమె భవిష్యత్తు ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఆమె ఒలింపిక్స్ ‌ముగించుకుని స్వదేశానికి చేరుకున్న సమయంలో.. ఎయిర్‌పోర్టు వద్ద కాంగ్రెస్‌ ఎం‌పీ దీపిందర్‌ ‌హుడా ఆమెకు స్వాగతం పలికారు. అంతకుముందు కూడా వినేశ్‌ను రాజ్యసభకు పంపాలంటూ కొంతమంది కాంగ్రెస్‌ ‌నేతలు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

 

భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జరిగిన ఆందోళనల్లో వినేశ్‌, ‌పునియా కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేశ్‌ ‌సోదరి బబితా 2019లో భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో దాద్రి స్థానం నుంచి పోటీ చేసిన ఆమె..ఓటమి పాలయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమెకు కమలం పార్టీ టికెట్‌ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అదే స్థానం నుంచి వినేశ్‌ను దించాలని కాంగ్రెస్‌ ‌ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈసారి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్‌ ‌సిస్టర్స్ ‌పోరు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారనుంది. ఈ రాష్ట్రంలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page