ఆర్టీసీ అభివృద్ధికి అహర్నిశలు కృషి

  • అందుబాటులోకి మరిన్ని కొత్త బస్సులు
  • ఉద్యోగ నియామకాలు చేపడతాం..
  • ఆర్టీసి లో రాజకీయ జోక్యం ఉండదు..
  • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
  • పొన్నం ప్రభాకర్‌
  • ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌టిజిఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని  రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌ ఆర్టీసీ కళా భవన్‌ ‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసి ఎండీ సజ్జనార్‌, ఇతర ఆర్టీసి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇటీవల మరణించిన ఆర్టీసి డ్రైవర్‌ ‌మెరుగు సంపత్‌ ‌కుటుంబానికి రూ.కోటి ప్రమాద బీమ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఒక మాతృమూర్తి జన్మనిచ్చిన సమయంలో వచ్చే పురిటి నొప్పుల మాదిరిగా కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసి పరిస్థితి దారుణంగా ఉండేదని, ఆర్టీసిలో గత 10 సంవత్సరాలు ఒక్క బస్సు కొనలేక  ఉద్యోగాలు నియామకాలు లేకపోయారని అన్నారు.  15 ఏళ్లు దాటిన బస్సులను కూడా స్క్రాప్‌ ‌కి పంపించకుండా నడిపించారని, వయస్సు మళ్లిన వాళ్ళు రిటైర్‌ అయిన ఉద్యోగులతో పనిచేయించుకున్నారని తెలిపారు. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ఆర్టీసీలో ఎండీ సజ్జనార్‌ ‌పలు సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. డిసెంబర్‌ 9 ‌న మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి అదృష్ట లక్ష్మి వచ్చిందని అన్నారు.  త్వరలోకొత్త బస్సులు కొంటున్నామని, 3035 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో విజయవంతం కావడానికి కృషి చేసిన సిబ్బందికి ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

వ్యక్తిగతంగా డ్రైవర్‌, ‌కండక్టర్‌,అధికారిగా, ఒక మంత్రిగా ఇది సంతృప్తి ఇచ్చే విషయమని అన్నారు.  ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందిస్తున్నవారికి అవార్డులు ఇస్తూ సన్మానిస్తున్నట్లుచెప్పారు.పెరుగుతున్న ట్రాఫిక్‌ ‌లో ఎలాంటి  రిమార్క్ ‌లేకుండా బస్సు నడిపే డ్రైవర్లను జోనల్‌ ‌వారీగా సన్మానం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కార్మికుల సంక్షేమంపై రాజీ లేదని అన్నారు. కార్మికుల బాండ్స్ 80 ‌కోట్ల పేమెంట్స్ ‌జరిగాయని, ఇంకా  200 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. రాఖి పండగ రోజున రికార్డు స్థాయిలో 14 .90 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

రికార్డు స్థాయిలో 64 లక్షల మంది ప్రయాణం చేశారు. ఇదంతా మీ అందరి కృషితోనే జరిగిందని కొనియాడారు. ఆర్టీసీకి ఉద్యోగులు, కార్మికులే గుండె కాయ లాంటివారని తెలిపారు. ఆర్టీసిపై  సీఎం రేవంత్‌ ‌రెడ్డి,  ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు తనతో సంప్రదిస్తూ సమీక్షిస్తున్నారుని తెలిపారు. ప్రయాణికుల పట్ల సిబ్బంది  మరింత క్రమశిక్షణగా మసలుకోవాలని సూచించారు.
మీకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.  259 రోజుల్లో 81 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page