డిమాండ్‌కు తగ్గ‌ట్టు విద్యుత్ సరఫరా

– లోటు రాకుండా అదనపు విద్యుత్ కొనాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ నేపథ్యంలో ప్రజాభవన్‌లో విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భానుడి భగభగలకుతోడు ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. దీనికి వ్యవసాయ అవసరాలు కూడా తోడవడంతో గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ మార్కెట్‌పై ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం లోటు రాకుండా పవర్ ఎక్స్ఛేంజిల ద్వారా అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్, తాగునీటి సరఫరా పథకాలు, అత్యవసర సేవలకు విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, జల విద్యుత్ ఉత్పత్తిని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అన్ని విద్యుత్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ స్థిరంగా ఉందని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అన్ని వర్గాల వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందిని నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ హరీష్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న భట్టి

భట్టి విక్రమార్క మల్లు గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. డిప్యూటీ సీఎం రాకను గమనించిన భక్తులు ఆయనను కలిసేందుకు ఉత్సాహం చూపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఆలయ సేవకులు కూడా ఆయనతో ఫోటోలు దిగారు. భక్తులతో ఆయన ఎంతో సావధానంగా ముచ్చటించారు. తిరుమల దర్శనం అనంతరం భట్టి విక్రమార్క శ్రీకాళహస్తికి చేరుకున్నారు. అక్కడ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కొలువుదీరిన పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – కావ్యరెడ్డి వివాహ వేడుక 

తిరుమలలో జరిగిన నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్-కావ్యరెడ్డిల వివాహ వేడుకకు భట్టి విక్రమార్క దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. పెళ్లి అనంతరం నూతన దంపతులు ఉప ముఖ్యమంత్రితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వారి కొత్త జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *