రైతు భరోసా ఇస్తూనే సదుపాయాలు కావాలి
‘రైతు భరోసా’పై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సదస్సులో భిన్నాభిప్రాయాలు
పదెకరాల వరకు రైతు భరోసా కల్పించాలని రైతులందరి అభిప్రాయం
సేద్యం చేస్తున్న వారికే ఇవ్వాలన్న అన్నదాతలు
ప్రత్యేక చట్టం ద్వారా కౌలు రైతులను ఆదుకోవాలని సూచన
రైతులు సూచనలు క్రోడీకరించి శాసన సభలో చర్చించి నిర్ణయిస్తామన్న డిప్యూటీ సిఎం భట్టి
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
వరంగల్, జూలై 15 : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ‘భరోసా’ ఏదైతే ఉందో అది కేవలం రైతు పెట్టుబడికే కాకుండా, ఉత్పత్తి రంగానికి ప్రభుత్వం ఇస్తున్న భరోసాగా భావించాల్సి ఉందని కొందరు రైతులు అభిప్రాయపడ్డారు. ‘రైతు భరోసా’పై ఏర్పాటు చేసిన సదస్సులో వరంగల్ రైతులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతుల విషయంలో ఇప్పటి వరకు ఏలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సదుపాయాలు కల్పించినప్పటికీ రైతుల కడగండ్లను మాత్రం తీర్చలేకపోయాయని ఈ సందర్భగా పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అందిస్తూ వొచ్చిన రైతు బంధు పథకాన్ని, రైతు భరోసాగా మార్చి రైతులకు అందజేయటంతో పాటు, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వవొచ్చన అభిప్రాయాలను నేరుగా రైతుల నుండే తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో రైతు సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో ఈ సదస్సులు నిర్వహించగా నాల్గవ జిల్లాగా ఉమ్మడి వరంగల్ సదస్సును సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించారు.
ఈ సదస్సులో పాల్గొనేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంపికైన 250 మంది రైతులతో పాటు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, ఆయా జిల్లాల కలెక్టర్లు మొదలు, ప్రజాప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంఎల్ఏలు, ఎంపీలు , ఎంఎల్సీలు పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఈ సదస్సులో ఇంచుమించు రైతులంతా ఒకటి నుండి పది ఎకరాల వరకు రైతు భరోసాను కల్పించాలని అభిప్రాయపడ్డారు. అయితే నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకే ఈ నిధులు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనడంతో పాటు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
కేవలం రైతు భరోసా పేరున రైతులకు అంతో ఇంతో ఇస్తున్న ప్రభుత్వం రైతుల ఇతర బాధలను పట్టించుకోకపోవడంవల్ల రైతులు అర్థిక ఇబ్బందులకు గురి అవుతూ, ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎరువులు, పురుగు మందులతోపాటు, ఆధునిక వ్యవసాయ పనిముట్లను సబ్సీడీకి అందజేయకపోవడం రైతుకు తీరని నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తున్న•దంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతీ పంటకు గిట్టుబాటు ధరను కల్పించడంతోపాటు, ఆ రంగంలో వినియోగించే ప్రతీ పనిముట్టును సబ్సీడీ రూపంలో అందజేస్తే రైతు భరోసా అవరసరమేలేదని మరికొందరు కరాఖండీగా చెప్పారు. ముఖ్యంగా చీడపీడలు, అతివృష్టి, అనావృష్టి, వడగండ్లవాన తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను సకాలంలో ప్రభుత్వాలు ఆదుకోకపోవడంకూడా రైతు ఆత్మహత్యలకు కారణంగా మారుతున్నది.
ఫలితంగా వ్యవసాయం దండుగ అనుకుంటున్న నేటి రోజుల్లో వ్యవసాయాన్ని పండుగగా మార్చేవిధంగా ప్రణాళికలను తయారుచేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా యువత ఈ రంగానికి దూరమవుతున్నదని, అలాంటి వారికి తగిన విధంగా ప్రోత్సహించేందుకు విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అకాశాన్నంటుతున్న కూరగాయల ధరలను దృష్టిలో పెట్టుకుని, వాటికి కూడా వరిధాన్యానికి కల్పిస్తున్నట్లు బోనస్ కల్పిస్తే పంటలు విస్తృతమై, ధరలు అదుపులోకి వొచ్చే అవకాశాలుంటాయన్నారు. అలాగే కౌలు రైతుల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కౌలు రైతును గుర్తించే విషయంలో గత ప్రభుత్వం నుండి, నేటి ప్రభుత్వం వరకు ఒక నిర్ణయానికి రాలేకపోతున్న విషయం తెలిసిందే. ఆ విషయంలో పలువురు పలురకాల సూచనలు చేశారు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, అందుకు అనుగుణంగా న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని రైతులు సూచించారు.
రైతులు చేసిన సూచనలన్నిటినీ క్రోడీకరించి, రాష్ట్ర శాసనసభలో క్షుణ్ణంగా చర్చిస్తామని సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వరంగల్తోసహా నాలుగు ఉమ్మడి జిల్లా రైతాంగం అభిప్రాయాలను తెలుసుకున్నామని, ఇతర• ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ సదస్సులు నిర్వహించి,. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాన్ని కూడా తీసుకుని దీనిపైన తమ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వొస్తుందన్నారు. ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వొస్తున్నదన్న భట్టి, ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో మంచి స్పందన వొచ్చిందని, అలాగే 500 రూపాయలకే గ్యాస్‌ను అందజేయటం, 200 యూనిట్స్ వరకు విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయడంతో ప్రజలకు తమ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని, ఇప్పుడు రైతాంగానికి రైతు భరోసా విషయంలో కూడా గత ప్రభుత్వంలో లాగా గుట్టలకు, వెంచర్లకు కాకుండా నిజమైన రైతులకు అందజేయాలన్న తమ ప్రభుత్వ సంకల్పమే ఈ సదస్సులకు కారణమన్నారు.




