– దేశంలో ఏకకాలంలో సోదాలు
– ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ప్రకటన
న్యూదిల్లీ, మే 13 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ లీకేజ్ వెనుక ఉన్న ప్రధాన ముఠాను బయటకు తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. సీబీఐ ప్రత్యేక బృందాలు రాజస్థాన్, హరియాణా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. సోదాల సమయంలో అనేక ఎలక్టాన్రిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ప్రశ్నాపత్రం లీక్, మధ్యవర్తుల వ్యవస్థ, భారీ మొత్తాల్లో డబ్బుల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంలో పరీక్షకు ముందుగానే కొందరు అభ్యర్థులకు ప్రశ్నాపత్రం అందించినట్లు అనుమానిస్తున్నారు. అరెస్టు అయిన అయిదుగురిలో ముగ్గురు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందినవారు కాగా, ఒకరు హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తి. మరొకరు మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతానికి చెందినవారు. అరెస్టయిన వ్యక్తులు ప్రశ్నాపత్రం సేకరణ, పంపిణీ, అభ్యర్థులతో సంబంధాలు ఏర్పరచడం వంటి కీలక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకుని సమగ్రంగా విచారిస్తున్నారు. రాజస్థాన్ లోని జమ్వా రామ్‌గడ్ ప్రాంతానికి చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులను సీబీఐ అధికారులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు ఈ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు. వారి ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో పలు డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, అభ్యర్థుల జాబితాలు లభించినట్లు సమాచారం. వీరి ద్వారా మరికొందరు అనుమానితుల వివరాలు కూడా సీబీఐకి లభించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో సోదాలు కొనసాగుతుండగానే మహారాష్ట్రలో కూడా సీబీఐ తన దర్యాప్తును విస్తరించింది. అక్కడ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరు అభ్యర్థులు, మధ్యవర్తుల మధ్య సంబంధాలు ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి ఫోన్ కాల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, సోషల్ మీడియా కమ్యూనికేషన్‌లను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారం అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ద్వారా నిర్వహించినట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా పలు డిజిటల్ పరికరాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. దిల్లీలోని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ప్రధాన కార్యాలయాన్నీ సందర్శించి రద్దయిన పరీక్షకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను సేకరించింది. ఈ పరీక్షా పక్రియలో పాలుపంచుకున్న అధికారులతో సీబీఐ బృందం మాట్లాడినట్లు అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





