కేరళం సీఎంగా సతీషన్

– ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్
– పది రోజుల కసరత్తు అనంతరం ప్రకటన

తిరువనంతపురం, మే 14: కేరళం సీఎం పోస్టుపై ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్రానికి తదుపరి సీఎంగా వీడీ సతీషన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ పదవి కోసం కె.సి.వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరకు సతీషన్‌నే ముఖ్యమంత్రి పదవి వరించింది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించింది. మొత్తం 140 స్థానాల్లో పోటీపడిన ఈ కూటమి 102 చోట్ల విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉండటంతో సతీషన్ ఎంపికకు అధిష్ఠానం పది రోజుల సమయం తీసుకోవడం గమనార్హం. కొచ్చికి సమీపంలోని నెట్టూర్‌లో 1964లో వీడీ సతీషన్ జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన సామాజిక కార్యకర్తగానూ పేరొందారు. కేరళ విద్యార్థి విభాగంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. తర్వాత యూత్ కాంగ్రెస్‌లో చేరి పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లారు. మంచి వక్తగానూ గుర్తింపు వచ్చింది. తర్వాత కాంగ్రెస్‌లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రజా నేతగా, ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా సంస్కరణాభిలాషిగా ఎదిగారు. 2001లో పరావుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. 2021 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ గెలుపొందగా యూడీఎఫ్ విపక్షానికే పరిమితమైంది. సతీషన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. పాలనాపరంగా ఎలాంటి అనుభవం లేని సతీషన్‌ను ప్రతిపక్ష నేతగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో పలువురు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఎల్‌డీఎఫ్‌ను ఎదుర్కొనే నేతగా తనను తాను నిరూపించుకున్నారు. అవినీతి, గోల్డ్ స్మగ్లింగ్ వివాదం, శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన వైఫల్యాలను ఎత్తిచూపి పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరాజయాలతో సతమతమవుతుంటే రాష్ట్రంలో మాత్రం హస్తం పార్టీ శ్రేణుల్లో ఆయన ఉత్సాహం నింపారని రాజకీయ విమర్శకులే అంగీకరించిన సందర్భాలున్నాయి. ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించి విజయన్‌కు ప్రధాన పోటీదారుగా నిరూపించుకున్నారు. క్షేత్రస్థాయిలోకి బలంగా చొచ్చుకెళ్లారు. అందుకే సీఎం ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు జరిపిన అభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయం వెల్లడైంది. పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నాయకత్వం వైపు మొగ్గు చూపగా ప్రజల్లో మటుకు సతీషన్ పేరు ఎక్కువగా వినిపించింది. దాంతో ప్రజాభిప్రాయంవైపే మొగ్గు చూపిన అధిష్ఠానం చివరకు ఆయన్నే సీఎం పదవికి ఎంపిక చేయాల్సి వచ్చింది.

సతీషన్‌కు రేవంత్ అభినందనలు : సముచిత గుర్తింపు 

హైదరాబాద్ : కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీషన్‌కు సీఎం ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళం ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేసే సతీషన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు అధికార బాధ్యతలు అప్పగించారని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, అక్షరాస్యతలో కేరళం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సతీషన్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పరస్పర సహకారం వంటి రంగాల్లో కేరళం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్ప్పుకొచ్చారు. కేరళం మరింత ప్రగతి, సుసంపన్నత దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *