ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం

ప్రభుత్వ అవినీతిపై చీల్చి చెండాడాలి
బిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం  

ప్రభుత్వ అవినీతిపై, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  దిశానిర్దేశం చేశారు.  మంగళవారం అధినేత కేసీఆర్  అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేవారు. బిఆర్ఎస్ పార్టీ శాసనసభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలన్నారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిందలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, కరెంటు కోతలు, సాగునీటి కొరత, కాలిపోతున్న మోటార్లు తదితర రైతాంగ సమస్యలతోపాటు, తాగు నీటి కొరతపై అసెంబ్లీ, మండలిలో గళం విప్పాలన్నారు.బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని, రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలని కేసీఆర్ సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మహిళలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలి. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలి. విద్యార్థుల ఒవర్సీస్ స్కాలర్ షిప్ లు  విడుదల చేయకపోవడం గురించి ప్రశ్నించాలి. వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రహజసమస్యలపై ఎండగట్టాలి. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలి. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ మండలి లో ప్రభుత్వాన్ని నిలదీయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బిఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అధినేత కేసీఆర్ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. కాగా… అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజా సమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. బి ఆర్ ఎస్ అధినేత అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సహా….శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page