- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- దిల్లీలో కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడికి వినతి
తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం న్యూదిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు, అధికారులు కలిశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు జాతీయ రహదారుల మంజూరు, రీజినల్ రింగ్ రోడ్డుపై నితిన్ గడ్కరీతో భేటీ అయి చర్చించారు. అలాగే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు. మంత్రితో పాటు ఆర్అండ్ బీ శాఖ స్పెషల్ ఛీఫ్, సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ఎన్.హెచ్. ఉన్నతాధికారుల బృందం పాల్గొంది.
మొదట నితిన్ గడ్కరితో సమావేశమైన మంత్రి.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్డుపై విన్నవించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం లభించేలా చూడాలని కోరారు. రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పూర్వపనులు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (ఎన్ హెచ్ –765), పర్వత్ మాల పథకం క్రింద 5 రోప్ వే ప్రాజెక్టుల మంజూరు.
సిఆర్ఐఎఫ్ సేతుబంధు పథకం కింద 12 ప్రాజెక్టుల మంజూరు. ఎన్ హెచ్ NH 65 లోని హైదరాబాద్-విజయవాడ విభాగం 6 లేనింగ్ ఎన్ హెచ్ 163 లోని హైదరాబాద్ – మన్నెగూడ విభాగం 4 లేనింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేడం వంటి 5 ప్రధాన అంశాలతో కూడిన అభ్యర్ధలను నితిన్ గడ్కరీకి అందించారు.