దనిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్..
దశాంతిభద్రతను విఘాతం కలిగించే కుట్రలను సాగనివ్వం.. :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వొచ్చినా ఎదుర్కోవడానికి నిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేసి, వారికి సకల సౌకర్యాలు కల్పించి ఎస్‌డిఆర్‌ఎఫ్ వ్యవస్థను బలోపేతం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ హెచ్‌ఎండీఏ ప్రాంగణంలో హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. . విపత్తుల వొస్తే కేంద్ర బలగాలపై ఆధార పడాల్సిన పరిస్థితి రాకుండా ఖమ్మంలో పోటెత్తిన వరదలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్ ను బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించారు.
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రాన్ని సురక్షితంగా తీర్చిదిద్దడం కోసం ఫ్రెండ్లీ పోలీస్ కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఉన్నత, మధ్య తరగతి వర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలు బయటకు వెళ్లి వ్యసనాలకు బానిసవ్వడంతో వారు పడుతున్న బాధలను అర్థం చేసుకున్న ప్రజా ప్రభుత్వం.. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించుకుందని చెప్పారు.
ఐటీ సెక్టార్ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో సవాలుగా మారిన సైబర్ సెక్యూరిటీ నేరాలను అదుపు చేయడానికి రాష్ట్రంలో ప్రత్యేక వింగ్ ను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు రక్షణ, ధైర్యం, నమ్మకం కల్పిస్తున్న పోలీసు వ్యవస్థ కు ఎటువంటి అవసరాలు వొచ్చినా తీర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలను కంటికి రెప్పల కాపాడేటువంటి పోలీస్ శాఖ కు కావలసిన బడ్జెట్, రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయడానికి కావలసిన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదని అన్నారు.
కొంత మంది అవసరాల కోసం కాకుండా, సమాజ అవసరాల కోసం మాత్రమే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ మహానగరంలో గందరగోళ పరిస్థితులు సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకురావడానికి కొంతమంది చేస్తున్న కుట్రలను సాగనివ్వమని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం అందరం కలిసి పని చేద్దామని, హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చడానికి, రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేద్దామన్నారు. పోలీస్ ఉద్యోగుల సమస్యలు వినడానికి ప్రజా ప్రభుత్వం తలుపులు తెరిచే ఉంచుతుంది. రాష్ట్ర ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే ఏ మంచి పని అయినా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలీస్ సిగ్నల్స్ వద్ద యాచక వృత్తి చేస్తున్న ట్రాన్స్ జెండర్స్ కు శిక్షణ ఇచ్చి పోలీస్ శాఖలో భాగస్వామ్యం చేసిన మానవత్వం కలిగిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.