•అభినదించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (టిజీ ట్రాన్స్‌కో) ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు ‘‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్ అవార్డు-2024’’ గెలుచుకుంది. ఈ అవార్డును నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (గ్రిడ్ ఇండియా), ఫోరమ్ ఆఫ్ లోడ్ డిస్పాచ్‌ర్స్ అందజేసింది. ఈసందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ వివరాలను వెల్లడించారు. అలాగే ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు సాధించినందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులను శుక్రవారం సాయంత్రం ప్రజభవన్ లో ఆయన అభినందించారు.
ప్రపంచ స్థాయి ఉత్తమ పద్ధతులు అమలు చేయడం, ఆధునిక సాంకేతికతను అనుసరించడం వల్ల ఈ అవార్డు సాధ్యమైందని అన్నారు. గత సంవత్సరం విద్యుత్ రంగంలో సాధించిన విజయాలకు ఇది మరో సమున్నత గౌరవమని పేర్కొన్నారు. అలాగే, ఆర్థిక, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, విద్యుత్ సంస్థల టీంను అభినందించారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన ప్రముఖ జ్యూరీ సభ్యులు స్వర్గీయ దినేష్ చంద్ర (మాజీ చైర్పర్సన్, సీఈఏ), ప్రముఖ విద్యుత్ నిపుణులు, ప్రీమియర్ విద్యాసంస్థలు, వరల్డ్ బ్యాంక్, ఎన్‌ఎల్‌డీసీ నుంచి ఉన్నారు. ఫోరమ్ ఆఫ్ లోడ్ డిస్పాచ్‌ర్స్ తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, టిజీట్రాన్స్‌కోను 2024లో బెస్ట్ ఎస్‌ఎల్‌డీసీ అవార్డు విజేతగా (లార్జ్ ఎస్‌ఎల్‌డీసీ కేటగిరీ) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును డిసెంబర్ 14, 2024న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ విద్యుత్ వ్యవస్థ సదస్సు సందర్భంగా తెలంగాణ విద్యుత్ విభాగానికి అందజేస్తారు.