‘‘తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల భవనాలకు శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి. రాష్ట్రంలోని దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణానికి మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పునాదిరాయి వేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కొందుర్గులో ఏర్పాటు చేయనున్న బడి భవనాలకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా షాద్‌నగర్,మధిర, కొడంగల్, ఖమ్మం, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరిగాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో ఏర్పాటు చేయబోయే స్కూల్‌కు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం మల్ల భట్టి విక్రమార్క. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిందన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు భూమి పూజ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి వివరించారు. నల్లగొండలోని గందంవారి గూడెంలో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలో అడవి సోమన్ పల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యతోపాటు మిగతా రంగాల అభివృద్ధి కోసం తాము సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు. పేదలకు ఉన్నత విద్యా కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు..’’
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు అట్టహాసంగా శంకుస్థాపన
మారనున్న విద్యారంగ పరిస్థితులు, పేదల విద్యకు కట్టుబడి ఉన్నామని మంత్రుల ప్రకటన
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్..
పేదలకు నాణ్యమైన విద్య అందించాలన్నదే మా తపన
కుల మతాల మధ్య భేదం లేకుండా ఒకే చోట విద్య
వైద్యరంగాన్ని బలోపేతం చేసి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తాం..
గత ప్రభుత్వం 5వేల బడులను మూసేసింది..
పేదలకు విద్యను దూరం చేసేందుకు బిఆర్ఎస్ కుట్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు
షాద్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. వైద్య సదుపాయాలు కూడా మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామని తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు నాణ్యమైన విద్య, పేదలకు వైద్యం అందిస్తామని మాట ఇచ్చామని, గత ప్రభుత్వం పేద పిల్లలకు విద్యను దూరం చేసే ప్రయత్నం చేసిందని, రాష్ట్రంలో 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందని విమర్శించారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని, అందుకే టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించామన్నారు.
రూ.22 లక్షల కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసిన కేసీఆర్.. 7 లక్షల అప్పు చేశారని, ప్రభుత్వ పాఠశాలలల్లో మౌలిక వసతులకు 10వేల కోట్లు ఖర్చు చేయలేదు. పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ 5వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారని ఆరోపించారు. పేదలకు విద్యను చేరువ చేసేందుకే తాము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1972లో పీవీ నర్సింహారావు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చారు. పీవీ దార్శనీక ఆలోచనతో బుర్రా వెంకటేశం వంటివారు ఐఏఎస్ స్థాయికి ఎదిగారు. గత ప్రభుత్వం పేదలకు విద్యను అందించేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టలేదు. కానీ మేం చేస్తుంటే తప్పుపడుతున్నారు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉంది.. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు అభ్యంతరం లేదు.. కానీ కోట్లాది రూపాయలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారు? ఏ దొరలు పేదలకు విద్య, వైద్యం దూరం చేశారో… ఆ దొరల పక్కన చేరి బలహీన వర్గాలకు మంచి చేస్తే విమర్శిస్తున్నారు. కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గొర్రెలు, బర్రెలు కాసుకుని బతకాలా? మేం అధికారంలోకి రాగానే 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, ఇటీవలే 11వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించామని తెలిపారు.
కుల మతాల మధ్య వైషమ్యాలు తొలగించడమే తమ విధానమని, కానీ వాళ్ల కుటుంబ సభ్యులే రాజ్యాలు ఏలాలనేది కేసీఆర్ విధానమని విమర్శించారు. మీ పిల్లలు రాజ్యాలు ఏలాలి కానీ… పేదల పిల్లలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించినన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా ఇచ్చినా వారికి జ్ఞానోదయం కాలేదని.. వాళ్లకు జ్ఞానోదయం కాకపోయినా ఫరవాలేదు… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏమైందో అర్ధం కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో ని 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ లో కేసీఆర్ పాలనలో కనీస మౌలిక వసతులు కల్పించలేదని, 33 జిల్లాల్లో ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి కేసీఆర్ పార్టీ భవనాలు కట్టుకున్నాడని, పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి, పైసలు ఉన్నాయి గానీ పిల్లలకు బడికి మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన ఆయనకు రాలేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేరుగా ఉంటే వారి మనసుల్లో విషం నిండుతుందని, అందుకే కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.




