విద్యా వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెడదాం..

  • కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి  
  • స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు
  • ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ
  • అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు
  • విద్యావ్యవస్థపై రాతపూర్వక సూచనలు ఇవ్వండి
  • శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
విద్యా ప్రమాణాల విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని, మన విద్యా ప్రమాణాలు పడిపోవడంపై కేవలం ప్రభుత్వమే కాదు. తెలంగాణ సమాజం కూడా బాధ్యత వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రక్షాళన మొదలు పెడదామంటే రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. విద్యా వ్యవస్థపై శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ..  2021నేషనల్ అచీవ్ మెంట్ సర్వే జరిగింది.  ఈ సర్వేలో మూడో తరగతి, ఐదో తరగతి చదివేవారిలో 75 శాతం మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో కనీస ప్రాథమిక సామర్థ్యం కూడా చూపలేదు.  సబ్జెక్టుల వారీగా దేశంలో 37 ర్యాంకుల్లో తెలంగాణ ఏ స్థానంలో ఉందో గమనిస్తే…మూడో తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలంగాణది 36వ ర్యాంకు.
గణితంలో 35వ ర్యాంకు. ఈవీఎస్ లో 36వ ర్యాంకు, ఐదవ తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలంగాణది 36వ ర్యాంకు. గణితంలో 35వ ర్యాంకు, ఈవీఎస్ లో 36వ ర్యాంకు, మూడో తరగతిలో ఉండి కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగినవారు.. 2018 లో 18.1 శాతం, 2022లో 5.2 శాతం, 2024 లో 6.3 శాతం, 5వ తరగతిలో ఉండి కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగిన వారు. 2018 లో 43.6 శాతం, 2022 లో 31.7 శాతం, 2024 లో 31.5 ఉన్నారు. అలాగే  మూడో తరగతిలో ఉండి కనీసం 2వ తరగతి లెక్కలు చేయగలిగిన వారు 2018లో 34.5 శాతం, 2022లో 28.7 శాతం, 2024 లో 31.0 ఉన్నారు. ఐదో  తరగతిలో ఉండి కనీసం 2వ తరగతి లెక్కలు చేయగలిగిన వారు 2018 లో 48.7 శాతం, 2022 లో 44.6 శాతం, 2024 లో 41.1 ఉన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య 6.50 లక్షలు తగ్గిందని సీఎం తెలిపారు.
ఎక్కడ విఫలమవుతున్నాం.. ?
తాము అధికారంలోకి వచ్చాక  10 వేల మంది టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేశామని,  36 వేల మంది టీచర్లను బదిలీలు ఎలాంటి ఆరోపణలు లేకుండా పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో 26,100 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల్లో ఒక్కో డే స్కాలర్ విద్యార్థిపై 1,8000 ఖర్చు పెడుతుంది. 98,000 రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే ఒక్కో విద్యార్థిపై ఖర్చు పెడుతున్నాం. మరి ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పండి? అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.  మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్కిల్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టాం. ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యునివర్సిటీ, అకాడమీని ప్రారంభించుకుంటున్నాం. త్వరలోనే స్పోర్ట్స్ కు సంబంధించి విధివిధానాలను రూపొందిస్తామన్నారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నాం. కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి చెప్పి… వంద నియోజకవర్గాల్లో వంద ఏటీసీలను ఏర్పాటు చేయబోతున్నాం. విద్యావ్యవస్థపై రాతపూర్వక సూచనలు ఇవ్వండి… అందరి సూచనలు, సలహాలతో ప్రక్షాళన చేయదలచుకున్నామని తెలిపారు.
మీ అందరి సూచనలతో ఒక పాలసీ డాక్యుమెంట్ రూపొందిస్తాం.. దానిపై కూడా చర్చ పెడదామన్నారు. ఈ రోజు నిర్ణయం తీసుకోకపోతే ఇక ఎప్పుడూ ప్రక్షాళన చేయలేం. ఇప్పటికీ మేల్కొనకపోతే భవిష్యత్ తరాలకు మనం ద్రోహం చేసిన వాళ్లం అవుతామని చెప్పారు. రెగ్యులర్ ఎడ్యుకేషన్ ను స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. కేవలం నిధుల కేటాయింపు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కాదు. మనందరం సామాజిక బాధ్యతగా భావిస్తేనే సమస్యను పరిష్కరించగలం. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.  మన విద్యా విధానం కొంత ఆందోళనకరంగా ఉంది.. దీనిని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినవారం అవుతాం. చదువు ఎన్ని అవకాశాలు ఇస్తుందో… పేదలకు విద్య ఎంత అవసరమో ప్రభుత్వ పాఠశాలలో చదివిన నాకు బాగా తెలుసు. అవసరమైతే భవిష్యత్ లోనూ విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకుని పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అందుకే పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు..
పాలమూరు రంగారెడ్డికి గతంలో ఏ పేరు లేదు.. అందుకే పాలమూరు ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కు మెట్రో రావడానికి కారణం జైపాల్ రెడ్డి. వారు కోరుకుంటే హైదరాబాద్ మెట్రోకు కూడా జైపాల్ రెడ్డి పేరు పెట్టినా తప్పులేదు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జైపాల్ రెడ్డి. ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన ఆయన సేవలు మరువలేం. ఆయన పేరును పాలమూరు ఎత్తిపోతలకు పెట్టుకోవడం సహేతుకం. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 31, 2026 లోగా 12 వాయిదాలలో గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత నుంచి ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ ను సమయానుగుణంగా ఎప్పటికప్పుడు చెల్లిస్తాం. కొందరు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి… రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. రిటైరైన వారి లయబిలిటీస్ ను తీసుకుని బకాయిలు చెల్లించే బాధ్యత తమదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page