- పునర్విభజన ప్రక్రియపై తర్వాత సమావేశం హైదరాబాద్‌లో నిర్వహిస్తాం..
- డీలిమిటేషన్ పై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా చేయాలని తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలని ఆయన సూచించారు.. రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలని సీఎం రేవంత్ చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజనపై మనందరిని ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ప్రత్యేక అభినందనలు. పునర్విభజనపై మనం అభిప్రాయాలను పంచుకోవాలి.
ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలి. ప్రస్తుతం దేశం పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది. బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోంది. 1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాలు, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.