పరేడ్ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అమరజవాన్ల స్తూపం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. నిజాంపై వేల మంది ప్రజలు వీరోచితంగా పోరాటం చేశారని కొనియాడారు. ప్రజల బలిదానాలు, త్యాగాల తరువాత తెలంగాణకు స్వాతంత్య్రం వొచ్చిందన్నారు. రజకార్ల మెడలు వంచడంలో దివంగత మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్‌ది సాహసోపేత పాత్ర అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
రజాకార్ల వారసత్వ పార్టీకి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు కొమ్ముకాస్తున్నాయని దుయ్యబట్టారు. బర్కత్ పురలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. హైదరాబాద్ విమోచనానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని కేంద్రహోంమత్రి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వొచ్చినా హైదరాబాద్‌కు మాత్రం వెంటనే రాలేదన్నారు. నిజాం, రజాకార్ల ఆగడాలకు.. ఆపరేషన్ పోలో ద్వారా పటేల్ ముగింపు పలికారని కొనియాడారు. పటేల్ పోలీస్ యాక్షన్‌తో నిజాం సైన్యం తలవంచిందన్నారు. పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో నిజాం తలవంచారని..13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు.
పటేల్ లేకపోతే హైదరాబాద్ విమోచనానికి మరింత సమయం పట్టేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజాం పాలన నుంచి విముక్తి లభించి 75 ఏళ్లు గడిచినా ఎవరూ విమోచన దినోత్సవ వేడుకలు జరపడానికి ముందుకు రాలేదని కేంద్రమంత్రి అన్నారు. ఇన్నాళ్లూ ఈ వేడుకలు నిర్వహించడానికి ఏ ప్రభుత్వమూ సాహసించలేదని పేర్కొన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని తెలిపారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రధాన మంత్రి మోదీ ప్రకటన చేసిన తర్వాతే మిగతా పార్టీలు నిద్రలో నుంచి మేల్కొన్నాయని వ్యాఖ్యానించారు. నిజాం, రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ పటేల్ ముగింపు పలికారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారు.
హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎందరో సైనికులు ప్రాణాలు అర్పించారని తెలిపారు. రజాకార్లు గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని ఆగడాలు జరిగాయన్నారు. జలియన్‌వాలాబాగ్ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగిందని.. ఆ ఘటనలో ఎంతో మంది నేలకొరిగారని పేర్కొన్నారు. తెలంగాణను పాలించిన పార్టీలన్నీ వోటు బ్యాంకు కోసమే పనిచేశాయన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదన్నారు. విమోచనోత్సవాలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలు శోభాయ మానంగా మారాయి. పోలీసుల కవాతులు, వీవీఐపీల రాక, కళాకారుల నృత్యాలతో విమోచన వేడుకలు సాగాయి. వేడుకల్లో కళాకారులు నృత్యాలతో అలరించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాలంకరణలో ప్రదర్శనలు ఇచ్చారు. మూడు రాష్టా కళారూపకాల ప్రదర్శనతో పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలు మార్మోగాయి. డప్పుదరువులు, ఒగ్గు కథలతో కళాకారులు హోరెత్తించారు.