ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా చేస్తాం..
జీనోమ్ వ్యాలీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్16: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30, 40 ఏళ్లుగా కృషి చేస్తున్న ఫార్మా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం, సకల వసతులు కల్పిస్తూ మరిన్ని పెట్టుబడులు వొచ్చే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తున్నామని చెప్పారు. సోమవారం లారస్ ల్యాబ్స్, కర్క ల్యాబ్స్ సుమారు 300 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో వందలాది మందికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రారంభించాయన్నారు.
ప్రపంచ ఫార్మా దృష్టిని ఆకర్షించేందుకు జీనోమ్ వ్యాలీని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా చేసి ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అందుకే, ఫార్మా కంపెనీల దిగ్గజాలతో మరిన్ని పెట్టుబడులు రాబట్టే విషయమై చర్చించామని తెలిపారు. సమావేశంలో టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జయప్రకాశ్‌రెడ్డి, ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టర్ గౌతమ్ పోట్రు, పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.