22ఏ భూముల పేరిట అన్యాయం జరగదు

– కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు
– ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకొని పనిచేయాలి
– అర్హుల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
– 22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోనే పరిష్కరించాలి
– కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఏ పేదవాడికీ, ఏ నిజమైన భూ హక్కుదారుడికీ అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వారి హక్కులను కాపాడటం, అదే సమయంలో ప్రభుత్వ భూములను రక్షించడం అనే రెండు లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎన్నడూ లేదన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములకు సంబంధించి వివిధ మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి బుధ‌వారం ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సమావేశం క్యూర్ పరిధి జిలాల్లకు సంబంధించినదైనా ఇందులో ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలి

22ఏ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధికారులు పూర్తిగా అర్థం చేసుకుని అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆదేశించారు. 22ఏకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు ఏ స్థాయిలో వచ్చినా పెండింగ్ లో ఉంచకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని, దరఖాస్తులను కూడా ప్రత్యేక దృష్టి సారించి వెంటనే విచారణ పూర్తి చేసి విధిగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. 22ఏ జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉందని గుర్తుచేస్తూ, ప్రజల హక్కులు, ప్రభుత్వ ప్రయోజనాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *