పంజాబ్ లో మళ్లీ “ఆప్” కే అధికారం

 అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కే స్వల్ప ఆధిక్యం

‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే

పంజాబ్ రాష్ట్రంలో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం… ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన ప్రత్యర్థులపై స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ విజయావకాశాల్లో ముందంజలో ఉంది. అయినప్పటికీ 2022 ఎన్నికల తరహాలో ఏకపక్ష తీర్పు కాకుండా ఈసారి ఎన్నికల సమరం పోటీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 58 నుండి 63 సీట్లు గెలుచుకుని సాధారణ మేజారిటీ మార్కుకు అతిచేరువగా లేదా స్వల్పంగా దాటే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే అంచనా వేసింది. ప్రతిపక్షంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 36 నుండి 43 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉన్నది. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ ( డబ్ల్యూడీ) పార్టీ 4 నుండి 7 సీట్లు గెలుచుకుని గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2 నుండి 6 సీట్లు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) 2 నుండి 4 సీట్లు గెలుపొందే అవకాశాలుండగా, ఇండిపెండెంట్లు, ఇతరులు మిగిలిన స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *