బహుళజాతి మందుల కంపెనీలు ఎనాడో మన వైద్య విధానాన్ని కబ్జా చేశాయి. మందులు వాళ్లే ఇస్తారు, రోగం వచ్చేట్టు వాళ్లే చేస్తారు. ఆ రోగం తగ్గేలా మందునూ వాళ్లే కనుగొంటారు. ఇదంతా కార్పొరేట్ ఆస్పత్రుల ముసుగులో జరుగుతున్న దోపిడీ. ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీ చేసి-అటు ఆస్పత్రులకు, మందుల కంపెనీలకు, ఇటు నిరుపేద రోగికి మేలు చేకూర్చేలా యత్నించడం విశేషం! ప్రాణాలను పణంగా పెట్టే వైద్యాన్నే మనం ఈ పద్ధతిలోకి దిగజార్చాక, ఇక ఎపుడో చచ్చిపోయే విద్యావిధానం ఎవరికి పట్టింది? ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా వుంది. ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న అనేక సమస్యలు ఈ వ్యవస్థపై పడి నానాటికీ దిగజారుతోంది.
ఇక మరో దురదృష్టకర విషయమే మిటంటే, తెలుగు రాష్ట్రాల్లో మేధావులు అనగానే ఓ పదిమంది వామపక్ష నాయక మేధావులు కన్పిస్తారు. వాళ్లే విద్యావేత్తలు, సామాజిక సంస్కర్తలు, వాళ్లే సీనియర్ జర్నలిస్టులు, వాళ్లే మానవ హక్కుల సంఘాల నేతలు, వాళ్లే కుల సంస్కరణవాదులు, వాళ్లే టీవీల్లో కూర్చొని రాజకీయాలను నిర్దేశించే మేధావులు, వాళ్లే సాహిత్యవేత్తలు..! అన్ని రంగాలను దురాక్రమణ చేసిన ఈ మహనీయులు గత ముప్ఫై ఏళ్ల నుండి ఈ వ్యవస్థలను కబ్జా చేసినవారే. వీరి పోరాటం నిరంతర ప్రవాహం. అది ఓ పట్టాన కొలిక్కివచ్చిన పాపాన పోలేదు. వీళ్ల పోరాటంలో వందమంది ఉంటే ‘మహాధర్నా’ అంటారు. నలుగురు కలసి సమావేశం పెడితే ‘రౌండ్ టేబుల్’ సమావేశం అంటారు. వీళ్లు ఈ దేశ ప్రాచీనతను అంగీకరించరు..
పాశ్చాత్య విధానాలను ఒప్పుకోరు! ఇపుడు విద్యలో నైతికత లోపించింది. నైతికత ఎందుకన్నట్లు కొందరు స్త్రివాద సంఘాల ముసుగులో యువతను రెచ్చగొడుతున్నారు. జీడిబంకలా సాగుతున్న టీవీ సీరియళ్లు మహిళా శక్తిని చంపేస్తున్నాయి. ఇన్నిరకాల సంఘర్షణలు, పతనాలను తట్టుకొని నిలబడగలిగే విద్యా విధానం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? కోళ్లఫారాల్లా నడుస్తున్న కార్పొరేట్ కాలేజీలను, స్కూళ్లను కట్టడి చేయలేని దుస్థితి నెలకొంది. ఎందుకంటే అలాంటి సంస్థలను నడిపే వ్యక్తులే మంత్రులుగా కొనసాగుతున్నారు. రోజురోజుకూ కునారిల్లుతున్న ప్రభుత్వ విద్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అందులో మన పిల్లలు చదవడం లేదు! స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఎన్నో కమిషన్లను వేసుకొన్న మనం వాటిని అమలుపరచిన పాపాన పోలేదు. తక్షణం మన విద్యా వ్యవస్థకు మరమ్మతు చేయకపోతే సమాజమే కుళ్లిపోవడం ఖాయం.
-చరణ్