గత ప్రభుత్వం ఎడాపెడా, దిక్కూ దెసా లేకుండా వందలాది మంది మీద అబద్ధపు కేసులు పెట్టిందనీ, అటువంటి అబద్ధపు కేసుల బాధితులలో స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఉన్నారనీ, అందువల్ల ఆ పాత కేసులన్నిటినీ సమీక్షించి, దురుద్దేశాలతో నమోదైన తప్పుడు కేసులన్నిటినీ ఉపసంహరిస్తామని గత డిసెంబర్ లో వాగ్దానాలు వెల్లువెత్తాయి. ఏడాది కావస్తున్నది గాని ఒక్కటంటే ఒక్క కేసును ఉపసంహరించిన వార్త లేదు.
ఒక్కోసారి మనుషులకు గత జన్మ స్మృతులు గుర్తు చేయవలసిన దుస్థితి దాపురిస్తుంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు, అందులోనూ ఏలికలకు, వారి కనుసన్నలలో ఎంతటి దుర్మార్గమైనా చేయడానికి సందేహించని అధికారులకు తప్పనిసరిగా వారి గత జన్మ సంభాషణలను గుర్తు చేయవలసి వస్తుంది. రాజకీయ నాయకులకైతే ప్రతి రోజూ కొత్త జన్మ లాంటిదే గనుక, నిన్న సాయంత్రం మాట్లాడిన మాట ఇవాళ ఉదయానికి గుర్తుండే అవకాశం లేదు గనుక తప్పనిసరిగా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేయకతప్పదు. ప్రస్తుతానికి మహా ఘనత వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, ఆయన ఇష్టప్రకారం నడుచుకుంటున్న పోలీసు శాఖకు గుర్తు చేయవలసిన మాటలు ఏడో హామీ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ.
ఆయన ఇంకా తెలంగాణాధీశులు కాకముందే, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండగానే, ఎన్నికల ఫలితాలలో స్పష్టమైన ఆధిక్యత కనబడ్డ తర్వాత, రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెపుతూ ఒక ఉపన్యాసం చేశారు. దాదాపు పదిహేను నిమిషాల ఉపన్యాసంలో ఆయన ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ అనే మాట తొమ్మిది సార్లు అన్నారు. అసలు ఉపన్యాసంలోని మొదటి రెండు నిమిషాల ఉపోద్ఘాతం లోనే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే మాట రెండు సార్లు ఉచ్చరించారు. మానవ హక్కులను, పౌరహక్కులను, ప్రజాస్వామిక పౌర హక్కులను పరిరక్షించడమే తమ ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలను సాగనివ్వబోమని అన్నారు. ప్రజాస్వామిక హక్కుల విషయంలో తమ ప్రభుత్వం గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలా ఉండబోదన్నారు.
ఆ ఉపన్యాసం తర్వాత మూడు రోజులకు ఆయనే ముఖ్యమంత్రిగా ఎన్నికై, ప్రమాణ స్వీకారం తర్వాత మరొక ఉపన్యాసం చేశారు. అందులోనూ మళ్లీ అవే మాటలు పునరుద్ఘాటించారు. ఇంకా చెప్పాలంటే, రెండు నెలల ముందు నుంచే, ఎన్నికల ప్రచారం లోనే, ఆయన ఈ మాటలు వాడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తయారు చేసిన ఎన్నికల ప్రణాళికలో ఆరు హామీలుండగా, తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా తాను ఏడో హామీ ఇస్తున్నానని, అది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ఎన్నోచోట్ల ఎన్నికల ప్రచార సభల్లో, టీవీ చర్చల్లో చెప్పారు. ఆ మాటలన్నీ రాష్ట్ర అధికార యంత్రాంగమంతా, ముఖ్యంగా పోలీసు శాఖలో నిర్ణయాధికారం ఉండేవారు, వినే ఉంటారు. ఏడో హామీని అమలు చేయడమంటే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమంటే నిజ జీవితంలో అర్థం, పర్యవసానం ఏమిటో వారికి అర్థమయే ఉంటుంది.
కాని పది నెలలు గడిచిపోయిన తర్వాత ముఖ్యమంత్రికి, ఆయన ప్రభుత్వం లోని పోలీసు అధికారులకు, ఆయనే ఇన్నిసార్లు పలికిన మాటలు మళ్లీ ఒకసారి గుర్తు చేయవలసి వస్తున్నది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మళ్లీ ప్రారంభమయిన ఎన్ కౌంటర్ హత్యల సందర్భంలో, ఎడతెగకుండా సాగుతున్న పోలీసు రాజ్యపు సందర్భంలో ఏడో హామీ అంటే, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా అని ప్రశ్నించవలసి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎన్ కౌంటర్ అనే ఇంగ్లిష్ మాటకు ఉండే ‘అనుకోకుండా ఎదురుపడడం’ అనే అసలు అర్థాన్ని మార్చేశారు. ‘పట్టుకుని ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపడం’ అనే కొత్త అర్థం కల్పించారు. నేరస్తులైతే అరెస్టు చేసి, విచారణ జరిపి, నేరం నిర్ధారించి, శిక్షించవలసిన చోట, ఆ ప్రక్రియ ఏమీ లేకుండానే, అసలు నేరం చేశారో లేదో కూడా తేలియకుండానే మరణశిక్ష విధించడానికి తమకు సంపూర్ణ అధికారం ఉన్నట్టు ప్రవర్తించారు.
అరెస్టు చేసే అవకాశం ఉన్నచోట కూడా హత్య చేయడానికే ఉవ్విళ్లూరారు. చంపే ఉద్దేశం తోనే పట్టుకోవడానికి వేగులను, వెన్నుపోటుదారులను ఏర్పాటు చేసుకోవడం, ఆహారంలో విషం కలపడం, దారి కాయడం, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వినియోగించడం, తమకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని మితిమీరి దుర్వినియోగం చేయడం వంటి ఎన్నో అక్రమాలు చేశారు. అలా పట్టుకొని హత్య చేసినందుకు, మనుషుల ప్రాణాలు తీసినందుకు చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో పారితోషికాలు, త్వరితగతి పదోన్నతులు కల్పించే సంప్రదాయం కూడా మొదలై, ఆ తర్వాత కూడా కొనసాగుతున్నది. అలా తెలంగాణలో నెత్తురుటేర్లు పారించినందుకు ఒక పర్యవసానంగానే ‘ఎన్ కౌంటర్లు లేని ప్రత్యేక తెలంగాణ’ అనే ఆకాంక్ష ప్రజల్లో వ్యాపించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె చంద్రశేఖర రావు కూడా ‘ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ’ అని నినాదం ఇచ్చారు. కాని ఆయన అధికార కాలంలో కూడా ఎన్ కౌంటర్ హత్యలు యథావిధిగా సాగిపోయాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో సాగిన అన్యాయాన్ని, అప్రజాస్వామికతను సరిదిద్ది, ప్రజాస్వామ్య పునరుద్ధరణ సాధించడానికే తన ప్రభుత్వం పని చేస్తుందని గంభీరమైన వాగ్దానాలు చేసిన రేవంత్ రెడ్డి పాలనా కాలం పది నెలల్లో కనీసం రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి, మరి కొన్ని ఎన్ కౌంటర్లు తప్పిపోయి ఉంటాయి. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్ గడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ హత్యలకు తెలంగాణ పోలీసుల సహకారం అందుతూనే ఉంది. తెలంగాణ సరిహద్దుల లోపలే చెప్పాలంటే, జూలై 25న జరిగిన మొదటి ఎన్ కౌంటర్ లో ములుగు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు దామరతోగు అడవిలో నల్లమారి అశోక్ ను చంపేశారు. సెప్టెంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం అడవిలో కుంజా వీరయ్య (లచ్చన్న), పూనం లక్కే (తులసి), కవ్వాసి రాము, సోడి కోసి, దుర్గేష్, గంగాల్ అనే ఆరుగురు ఆదివాసులను చంపేశారు. అవతలి వ్యక్తులు ఆయుధాలు ధరించి ఉన్నారనీ, వారే ముందు కాల్పులు జరిపారనీ, ఆత్మరక్షణ కోసం తాము ఎదురుకాల్పులు జరిపామనీ, కాల్పులు ముగిశాక చూస్తే, అవతల మృతదేహాలు కనబడ్డాయనీ, యథావిధి పోలీసు కథనాలు వెలువడినప్పటికీ, గత ఐదున్నర దశాబ్దాల తెలుగు సీమ ఎన్ కౌంటర్ల చరిత్ర తెలిసిన ఎవరైనా ఆ పోలీసు కథనాలను నమ్మజాలరు.
ఆత్మరక్షణ కోసమే జరిపిన కాల్పులలో అవతల ఎవరో చనిపోయారు అని తమకు తాము కితాబు ఇచ్చుకోవడం సరి కాదనీ, అటువంటి అసహజ మరణం ప్రతి ఒక్కదాన్నీ మొదట హత్యా నేరం కింద నమోదు చేయాలనీ, న్యాయస్థానపు విచారణలో ఆ పోలీసులు తాము ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు జరిపామని రుజువు చేసుకోవలసి ఉంటుందనీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు దశాబ్దాల కింద ఇచ్చిన తీర్పును పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడైనా ఏడో హామీ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే మాటలు గుర్తుంటే, వాటికి కట్టుబడాలనే పట్టింపే ఉంటే ఈ ప్రభుత్వం ఈ రెండు ఎన్ కౌంటర్ల మీద, అందులో పాల్గొన్న పోలీసుల మీద హత్యా నేరం కేసు నమోదు చేసి, విచారణ జరిపి, నిందితులను తమ నిర్దోషిత్వం నిరూపించుకొమ్మనాలి. అంత విశాలమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందనే భ్రమలు ఎవరికీ లేవు గాని, పోలీసుల మాట నిజమో కాదో తేల్చుకునే అవకాశమైనా ఉండాలి గదా. ఎన్ కౌంటర్ అని పోలీసులు ప్రకటించిన చోట వాస్తవంగా ఏమి జరిగింది, పరిసర గ్రామస్తులు ఏమి చెపుతారు, అక్కడి పరిస్థితులు చెప్పే సాక్ష్యాలు, చూపే ఆధారాలు ఏమిటి అని పరిశీలించడం సాధారణంగా నిజనిర్ధారణ బృందాల పని. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి అకృత్యం జరిగినప్పుడైనా నిజ నిర్ధారణ బృందాన్ని పంపించి వాస్తవాలు తెలుసుకొని బైటపెట్టడం బ్రిటిష్ వలస పాలనలో భారత జాతీయ కాంగ్రెస్, గాంధీ, నెహ్రూలు ప్రారంభించిన సంప్రదాయమే. హైదారాబాద్ రాజ్యంలోనూ బాబేఝరిలో కొమురం భీంను కాల్చి చంపగానే కనీసం మూడు నిజనిర్ధారణ బృందాలు వెళ్లి గోలకొండ పత్రికలో తమ నివేదికలు ప్రకటించాయి.
కడివెండిలో దొడ్డి కొమరయ్యను కాల్చి చంపగానే పద్మజా నాయుడు, వట్టికోట ఆళ్వారుస్వామి తదితరులు నిజ నిర్ధారణ బృందం వెళ్లారు. గత ఐదు దశాబ్దాలలో వందలాది నిజ నిర్ధారణ బృందాలు వెళ్లి ప్రభుత్వం, పోలీసులు చెపుతున్నది నిజమో కాదో ప్రజలకు తెలియజెప్పాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రభుత్వం వలస పాలకులు, నిజాం పాలన, వెంగళరావు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వాల కన్నా రెండాకులు ఎక్కువ చదివానని చూపుకుంటున్నది. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పాలనలో పౌరహక్కుల నిజ నిర్ధారణ బృందాన్ని మధ్య దారిలోనే అరెస్టు చేసి, ఆ ఘటనా స్థలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ బృందం అక్కడికి వెళితే, అక్కడి ప్రజలతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకుంటే, వాటిని ప్రజలకు చెపితే ఏం జరిగి ఉండేది? ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఆటంకం అయి ఉండేదా? అధికరణం 21 కింద రాజ్యాంగ హామీ ఇచ్చిన జీవించే హక్కును పోలీసులు తుంగలో తొక్కుతున్నారనే వాస్తవం బైటపడి ఉండేదా? మోదీని, అమిత్ షాను, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినట్టు నటిస్తున్నా, వాస్తవంగా మోషా ప్రభుత్వపు ‘ఆపరేషన్ కగార్’ మావోయిస్టు నిర్మూలనా కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి కూడా భాగం ఉందనే వాస్తవం బైటపడి ఉండేదా?
ఎన్ కౌంటర్ లాంటి పెద్ద విషయాలు పక్కన పెట్టండి. నగరంలో ఒక చిన్న సమావేశం కోసం హాలు బుక్ చేయాలని వెళితే, ‘స్థానిక పోలీసుల అనుమతి తెచ్చుకుంటే తప్ప హాలు అద్దెకు ఇవ్వలేం’ అని హాలు యాజమాన్యం అన్నదని ఇప్పటికి కనీసం రెండు సంఘాలు ప్రకటించాయి. ‘మా పాలన గత పాలన లాగా ఉండబోదు’ అని ఏలిక అధికారం లోకి రాగానే చేసిన ప్రకటనకు అర్థం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కాదన్న మాట. ‘గత ప్రభుత్వంలో ఉన్నపాటి ప్రజాస్వామ్యం కూడా మేం సాగనివ్వం’ అని అన్నమాట! గత పాలనలో కనీసం హాలు యాజమానుల మీద ఇటువంటి ఆంక్షలు లేవు. అసలు హాలు లోపల, ప్రాంగణం లోపల జరిగే సభకు పోలీసుల అనుమతే అవసరం లేదు. బహిరంగ ప్రదేశంలో, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వాడుతూ, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా సభ పెట్టుకున్నప్పుడు కూడా పోలీసుల అనుమతి అవసరం లేదు. ట్రాఫిక్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం పోలీసులకు సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే, రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్సభా స్వాతంత్ర్యాల అధికరణం 19 అంటే అర్థం అది. మరి తెలంగాణాధీశుల దృష్టిలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే భిన్నమైన అర్థం ఉన్నట్టుంది.
గత ప్రభుత్వం ఎడాపెడా, దిక్కూ దెసా లేకుండా వందలాది మంది మీద అబద్ధపు కేసులు పెట్టిందనీ, అటువంటి అబద్ధపు కేసుల బాధితులలో స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఉన్నారనీ, అందువల్ల ఆ పాత కేసులన్నిటినీ సమీక్షించి, దురుద్దేశాలతో నమోదైన తప్పుడు కేసులన్నిటినీ ఉపసంహరిస్తామని గత డిసెంబర్ లో వాగ్దానాలు వెల్లువెత్తాయి. ఏడాది కావస్తున్నది గాని ఒక్కటంటే ఒక్క కేసును ఉపసంహరించిన వార్త లేదు. మొత్తం మీద వెంగళ రావు నుంచి చంద్రబాబు మీదుగా రాజశేఖర రెడ్డి దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక పోలీసు రాజ్యం, చంద్రశేఖర రావు పాలనలో ప్రత్యేక తెలంగాణలో మారాకు వేసి, రేవంత్ రెడ్డి పాలంలో మొగ్గ తొడుగుతున్నట్టున్నది. ఇదీ ఏడో హామీ! ఇదీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ!