జాతిపితకు మాజీ ముఖ్యమంత్రి నివాళులు
దేశ స్వాతంత్ర్య సాధన కోసం సాగిన మలి దశ పోరాటాన్ని శాంతియుతంగా నడిపించి, గమ్యాన్ని చేరుకున్న జాతిపిత మహాత్మా గాంధీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ సాధన కోసం తాను సాగించిన మలిదశ పోరాటం లో ఇమిడివున్నదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. గాంధీ జయంతి ( అక్టోబర్ 2) సందర్భంగా దేశం కోసం వారు చేసిన కృషిని, త్యాగాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. బాధితులకే సహనం ఎక్కువగా ఉండాలని, శాంతియుత మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి విజయం సాధించేందుకు మార్గం సుగమం అవుతుందనే గాంధీజీ కార్యాచరణ తన తెలంగాణ ఉద్యమ పంథాను ముందుకు నడిపించిందని కేసీఆర్ తెలిపారు.
భారత ప్రజలు మెచ్చేలా శాంతియితంగా పార్లమెంటరీ పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనతి కాలం లోనే దేశం గర్వించే దిశగా అభివృద్ధి పథంలో నిలిపిన నాటి బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి వెనక గాంధీజీ స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ అన్నారు. గాంధీజీ బోధనలు కార్యాచరణ అన్ని కాలాలకు అన్ని వర్గాలకు ఆచరణీయమని కేసీఆర్ పునరుద్ఘటించారు.