డబుల్ బెడ్ రూమ్ లకు ప్రతిపాదనలు పంపాలి
ఇరిగేషన్, రిజర్వాయర్ల పనుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి
గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలి
తొర్రూర్ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాలకుర్తి ప్రజాతంత్ర నవంబర్ 7 : రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మార్కెట్లను అభివృద్ధి చేసి రైతులకు సేవలందించాలన్నారు. నూతనంగా ఎన్నికైన తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డిని అభినందించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూర్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. జనగామ, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు అద్వైత్ కుమార్, రిజ్వాన్ బాషా షేక్, సంబంధిత అధికారులతో కలిసి తొర్రూరులోని మిషన్ భగీరథ అతిథి గృహంలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని ఆదేశించారు. సన్న రకాలకు సర్టిఫై చేసి కొనుగోళ్లు చేయలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరగా మంజూరు చేయాలని సూచించారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ రిజర్వాయర్లు, కెనాల్స్‌లో మరమ్మతులు ఉంటే వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త పనులకు అవసరం ఉన్న చోట ప్రతిపాదనలు పంపాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీరాజ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విభాగాలలో పెండింగ్ లో ఉన్న పనులును వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు.
మహబూబాబాద్, జనగామ జిల్లా పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఉన్నత పాఠశాలల మంజూరుకు స్థల సేకరణ చేసి ప్రతిపాదనలు వెంటనే పంపాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. భూ అక్రమణలను గుర్తించి సంబంధిత వ్యక్తులకునోటీసులు అందించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో రెండు పడకల గదుల నిర్మాణంలో ఎన్ని సిద్ధంగా ఉన్నాయో గుర్తించి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. మిగతా అవసరమైన రెండు పడకల గదులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు, తదితర సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.