ఆందోళన చెందొద్దు.. సరిపడ ఇంధనం ఉంది

– పెట్రోల్, డీజిల్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు
– సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్
– ఫిర్యాదుల కోసం అందుబాటులోకీ 1967 టోల్ ఫ్రీ నెంబర్
– అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేదని, ప్రజలకు సరిపడ సరఫరా చేసేందుకు అవసరమైన నిల్వలు ఉన్నాయని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ల‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. డీజిల్, పెట్రోలు కొరత ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అనవసరంగా ఆందోళన చెందకండి అంటూ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా, ఇతర సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇంధన సరఫరా కోసం ప్రత్యేకంగా కంట్రొల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ఫిర్యాదుల కోసం 1967 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని, వ్యవసాయ అవసరాల కోసం డీజిల్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. ఇంధన సరఫరాలో ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడితే అప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీ సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సాధారణ సరఫరాతో పోల్చి చూసినపుడు ప్రస్తుతం 210% డీజిల్ సరఫరాను,  పెట్రోల్ సరఫరాను 132% పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. రోజువారీగా పెట్రోల్, డీజిల్‌లు కలిపి 36,404 కిలో లీటర్లు సరఫరా చేస్తుండగా ప్రస్తుతం సాధారణ స్థాయి కంటే 175% అధికంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇంధన సరఫరాపై పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ప్రజల్లో అనవసర ఆందోళన మొదలై ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

ఆ ప్రచారం అవాస్తవం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను భారీగా పెంచినట్లు వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లభ్యతపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సాధారణ రోజుల్లో పెట్రోల్ 6,400 కిలోలీటర్ల సరఫరా ఉండగా దానిని 10,300 కిలోలీటర్లకు పెంచారు.. నగరంలో సరఫరాను 3,200 నుండి 6,400 కిలోలీటర్లకు (రెట్టింపు) పెంచారు.. సాధారణంగా డీజిల్ 8,000 కిలోలీటర్లు ఉండగా ప్రస్తుతం 15,500 నుండి 19,300 కిలోలీటర్ల వరకు సరఫరా చేస్తున్నారు అని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,325 పెట్రోల్ బంకుల్లో 106 అవుట్‌లెట్లలో మాత్రమే సాంకేతిక కారణాల వల్ల (ట్రాన్స్‌పోర్ట్, ఇండెంట్ ఆలస్యం) స్టాక్ తాత్కాలికంగా అందుబాటులో లేదన్నారు. సాయంత్రానికి ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ధరలు పెరుగుతాయని, సరఫరా ఆగిపోతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల ప్రజలు అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారని, దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని పేర్కొన్నారు. ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం లేదని మంత్రి స్పష్టత ఇచ్చారు. పెద్ద మొత్తంలో ఇంధనం వాడే బల్క్ యూజర్లు రిటైల్ బంకుల వద్దకు రావడం వల్ల సామాన్య వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోందని, ఆ యూజర్లు తమకు కేటాయించిన ప్రత్యేక సరఫరా వ్యవస్థ ద్వారానే ఇంధనాన్ని పొందాలని కోరారు. ఎల్పీజీ విషయంలో కూడా ఎలాంటి కొరత లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు తగినంత సరఫరా చేస్తున్నాయంటూ చిన్న వ్యాపారులు తమ అవసరాల కోసం 5 కిలోల సిలిండర్లను వాడుకోవచ్చని సూచించారు. పెట్రోల్, డీజిల్‌ను ఇళ్లలో నిల్వ చేసుకోవద్దని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కోరారు. తెలంగాణలో కానీ, దేశంలో కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు.. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు అని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *