ప్రాణహితపై వెనక్కి తగ్గేది లేదు

ప్రతిపాదనలు సిద్దం చేశాం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. వఅశ్రీ మీడియాతో బుధవారం మాట్లాడుతూ తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ సమష్టిగా నాలుగు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తెచ్చాయని, ప్రతీ ప్రతిపాదనకు అయ్యే ఖర్చు, అనుకూల, ప్రతికూలతలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరగనున్న సమీక్షా సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలను వర్షాకాలంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతీ 1.5 మీటర్ల దూరంలో ఎస్పీటీ టెస్టులు నిర్వహించాలని, ప్రతీ మూడు మీటర్ల దూరంలో పెర్మిబిలిటీ టెస్టులు జరపాలని, బోర్లు వేస్తున్న సమయంలో రాయి వచ్చినప్పటికీ రాయి లోపలికి 5 మీటర్లు లోతుగా బోర్లు వెయ్యాలిలని సూచించారు. బ్యారేజ్‌ల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటీ బ్యారేజ్‌లను సందర్శించి టైంలైన్‌ను ఫిక్స్ చేసుకోవాలన్నారు. సీడబ్ల్యూపీఆరఎస్ డైరెక్టర్ క్షేత్ర స్థాయిలో ఉంటూ పునరుద్ధరణకు అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. పునరుద్ధరణ పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా సమాచారం అందించాలి అని మంత్రి ఉత్తమ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *