- వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ముందుకు…
- ఇక అన్ని పథకాలకు ఒకే కార్డు..
- డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న డిజిటల్ కార్డులను గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు కావాలని ప్రజలు పదేళ్లు చెప్పులరిగేలా తిరిగినా నాడు కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ప్రతీ పేద వాడికి రేషన్ కార్డు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అందుకే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని కొంతమందికి రేషన్ కార్డుకి, ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో వివిధ శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరుస్తామని, 30 శాఖల సమాచారం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళుతోందని, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.





