చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం..!
సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి రేవంత్
లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్, ప్రజల విజయం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తెలంగాణ భవన్ లో ఘనంగా దీక్షా దివస్
తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం వొచ్చిందని, ఆత్మగౌరవం, అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లమవుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో జరిగిన దీక్ష దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లడారు. కేసీఆర్ ఆనవాళ్లు కాదు.. తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడు. కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తొస్తోంది. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లా మారింది. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడున్న రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడు. ఉద్యమంపై గన్ను ఎక్కుపెట్టిన రేవంత్.. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని రెచ్చిపోతున్నడు. సోనియమ్మ లేకపోతే తెలంగాణ అడుక్కు తినేదని అహంకారంతో వాగుతున్నడు కాంగ్రెస్ సీఎం.
తెలంగాణ అస్తిత్వంపై గుజరాత్ గులాములు ఓ పక్క, దిల్లీ కీలుబొమ్మలు మరో పక్క దాడి చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ లో మన గళం వినిపించే నాథుడే లేడు. తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే. ఇంకెవరూ కాదు. లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం, తెలంగాణ ప్రజల విజయం. ఇది బీఆర్ఎస్ విజయం.. తెలంగాణ ప్రజల విజయం. గిరిజనులు, దళితులు, బీసీల, రైతుల విజయం.
ఈ రియల్ ఎస్టేట్ బేహారీకి, పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు. మరొక రూపంలో మీ భూములు కావాలంటూ మళ్లీ వస్తాడు. జాగ్రత్తగా ఉండాలే. ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకు ఉన్న గత్యంతరం. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయ్యింది. మైనార్టీ సోదరులు కూడా మనవాళ్లు ఎవరో.. కానివాళ్లు ఎవరో గుర్తించాలి. బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసి ప్రయోజనం పొందారు. కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుందని కేటీఆర్ అన్నారు.