కరవు జిల్లాల్లో నల్లగొండ, సంగారెడ్డిలది అగ్రస్థానం

– తర్వాతి స్థానాలు సూర్యాపేట వికారాబాద్‌ జిల్లాలు
– రైతులను ఆదుకునే చర్యలు చేపడుతున్న ప్రభుత్వం

(మండువ రవీందర్‌రావు)

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరవు జిల్లాల్లో మొదటి వరుసలో నల్లగొండ, సంగారెడ్డిలు నిలిచాయి. ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షాపాతం కారణంగా రాష్ట్రమంతా కరవు పరిస్థితులు ఏర్పడినవిషయం తెలిసిందే. అయితే ఏ ప్రాంతంలో ఎన్ని మండలాలు కరువుకు గురిఅయినాయన్న విషయాన్ని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఇందులో అత్యంత కరవు ప్రాంతాల జాబితాలో పై రెండు జిల్లాలు చోటుచేసుకున్నాయి. ఆ జాబితాలో ముందువరుసలో పై రెండు జిల్లాలున్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో మొత్తం 33 మండలాలుండగా 28మండలాలు కరవుకాటుకు గురైనాయి. అందులోనూ అత్యంత అధిక కరువుబాదిత మండలాలుగా ఎనిమిది గుర్తించబడ్డాయి. ఉమ్మడి నల్లగొండ అంటే (నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి) కలిపి చూస్తే 68 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. అసలే ఫ్లోరైడ్‌, ‌ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న నల్లగొండ ప్రజలకు ఎల్‌నినోతో మిన్నువిరిగి మీదపడినట్లైంది. ఇక్కడ భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బోరుబావుల్లో, వ్యవసాయబావుల్లోకూడా నీరు లభ్యంగాని పరిస్థితి ఏర్పడింది. సంగారెడ్డిజిల్లాలో 28 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో జహీరాబాద్‌, ‌కోహీర్‌లు అత్యంత ప్రభావిత కరువు మండలాల జాబితాలో చేరాయి. ఆ తర్వాత స్థానం సూర్యాపేటది. సూర్యాపేటలో మొత్తం 23మండలాల్లో కరువు ఏర్పడగా వాటిల్లో నాలుగు మండలాలు అత్యంత కరువు ప్రభావిత జాబితాలో చేరాయి. మిగతా 19 మండలాల్లో ఒక మోస్తరు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదేస్థాయిలో ఆదిలాబాద్‌, ‌వికారాబాద్‌ ‌జిల్లాలున్నాయి. ఈ జిల్లాల్లో ఇరవై మండలాల చొప్పున కరువు మండలాలు గుర్తించబడ్డాయి. నిజామాబాద్‌, ‌రంగారెడ్డి పద్దెనిమిది మండలాల చొప్పున, యాదాద్రి భువనగిరి, ఖమ్మం 17 మండలాల చొప్పున, ఆ తర్వాత స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం 16 మండలాలతో కరువు ప్రాంతాలుగా గుర్తించడమైంది. రాష్ట్రంలో మొత్తం 621 మండలాలుండగా 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. వీటిల్లోకూడా 111 మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా పేర్కొంది. సాధారణ వర్షపాతం కన్నా తక్కువ నమోదు అయిన మండలాలు, భూగర్భజలాలు పడిపోయిన ప్రాంతాలు, ఎండిపోయిన పంటలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాను తయారు చేసింది. గత ఏడాదితోపోలిస్తే జూన్‌ ఒకటి నుండి సెప్టెంబర్‌ 30 ‌వరకు రాష్ట్రంలో పడవల్సినంత వర్షపాతం పడలేదు. దాంతో దాదాపు 17శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయింది. ఫలితంగా వ్యవసాయ విస్తీర్ణంకూడా తగ్గింది. సాగు విస్తీర్ణంకూడా దాదాపు 18శాతం తగ్గిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అందుకే 33శాతం కంటే ఎక్కువ పంటనష్టం జరిగిన మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వ సూచనలున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 20శాతం పంటనష్టం జరిగిన మండలాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఎల్‌నినో, కొరవడిన వర్షపాతం, ఎండిపోయిన పంటల నేపద్యంలో మున్ముందు పూర్తిస్థాయిలో దిగుబడి తగ్గిపోయే అవకాశాలుండడంతో 20శాతం పంటనష్టాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నది. వచ్చే జూన్‌ ‌వరకు నీటికష్టాలు తప్పవని చెబుతున్న ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపడుతున్నది. ప్రధానంగా కరువు మండలాల్లో రైతులకు ఇన్‌పుట్‌ ‌సబ్సీడీని అందజేయాలని అధికారులకు సూచించింది. ముఖ్యంగా తాగునీరు, పశుగ్రాసం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే కరువు మండలాల్లో రైతుకూలీలు, ఇతర కూలీలను అర్థికంగా ఆదుకునేందుకు వందరోజుల పనిదినాలను 150 రోజులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ విపత్తు నుండి కోలుకునేందుకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహకారాన్ని అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *