– విధివిధానాలపై ‘సెస్’ డైరెక్టర్తో బీసీ కమిషన్ చర్చలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉన్న లొద్ద కులస్తుల సామాజిక, ఆర్థిక, విద్య, జీవన స్థితిగతులను అధ్యయనానికి సంబంధించిన విధివిధానాల గురించి సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ఇ.రేవతితో బీసీ కమిషన్ ప్రాథమిక చర్చలు జరిపింది. చైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన రాష్ట్ర బీసీ కమిషన్ సమావేశం బుధవారం మధ్యాహ్నం ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో జరిగింది. బీసీ సాంప్రదాయ కులవృత్తుల స్థితిగతులు, ఆధునికీకరణ విషయంలో కమిషన్ అధ్యయనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కూడా ‘సెస’ సహకారాన్ని కోరుతూ అధ్యయనం విధివిధానాల గురించి కూడా డైరెక్టర్‌తో కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. తదుపరి కమిషన్ సమావేశంలో వివిధ అంశాల గురించి కూలంకషంగా చర్చించింది. ముఖ్యంగా సంప్రదాయ కులవృత్తుల ఆధునికీకరణ విషయంలో ఆయా కులస్తులు, మేధావుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానించాలని నిర్ణయించింది. మరోపక్క బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న 22 కార్పొరేషన్లు/ఫెడరేషన్లకు 2026-27 బడ్జెట్‌లో దాదాపు రూ.2,592.93 కోట్లు కేటాయించినప్పటికీ ఆ నిధులను విడుదల చేయకపోవడం, ఖర్చు చేయకపోవడం పట్ల కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు ఎలాంటి పనులు చేపట్టకుండానే రెండేళ్ల పదవీ కాలం ముగియడం శోచనీయమని కమిషన్ అభిప్రాయపడింది. ముదిరాజ్ కులస్థులు కోరుతున్న బిసి-డి నుండి బిసి-ఎ గ్రూపునకు మార్పుపై కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. మార్పు వల్ల ప్రభావితమయ్యే ‘ఎ’ గ్రూప్‌లోని 57 కులాలు, ‘డి’ గ్రూప్‌లోని 34 కులాల గురించి కూడా అధ్యయనం చేసిన తర్వాతే ముదిరాజ్ కులస్థుల గ్రూప్ మార్పు గురించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది. సీపెక్ సర్వే ద్వారా సేకరించిన ఆయా కులాల సమాచారాన్ని అందజేయాలని ఇప్పటికే కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కుల వివరాలు, విద్య, స్థానిక సంస్థల్లో ఆయా కులాల ప్రాతినిధ్య వివరాలు కమిషన్‌కు ఇంకా సంబంధిత శాఖల నుండి అందాల్సి ఉంది. ఆయా సమాచారాన్ని కూడా కమిషన్ పరిశీలించాల్సి ఉంది. అదేవిధంగా బిసి-డి గ్రూప్ నుండి ‘ఎ’ గ్రూప్‌కు మార్చమని కోరుతున్న సగర, ఉప్పర కులస్థుల వినతిని కూడా సమగ్ర సమాచారం వచ్చిన తర్వాత పరిశీలించాలని నిర్ణయించింది. కమిషన్ కార్యాలయంలోని గ్రంథాలయాన్ని బి.పి.మండల్ గ్రంథాలయంగా, సమావేశ మందిరాన్ని కె.ఎన్.అనంతరామన్ సమావేశ మందిరంగా నామకరణం చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఆధునీకీకరించిన బి.పి.మండల్ గ్రంథాలయాన్ని నవంబర్ 14న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించాలని కమిషన్ నిర్ణయించింది. సమావేశంలో ప్రత్యేక అధికారి ఎన్.సునీత, సెక్షన్ ఆఫీసర్లు జి.సతీష్ కుమార్, ఇర్ఫాన్ బిన్ ఖలీద్, రీసెర్చ్ ఆఫీసర్ జి.లక్క్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





