స్కిల్ వర్సిటీలో ‘విప్రో’ భాగస్వామి కావాలి: మంత్రి శ్రీధర్ బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విప్రో భాగస్వామి కావాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్ లో విప్రో సంస్థ కార్యకలాపాల పురోగతిని వివరించేందుకు శుక్రవారం ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రాఘవన్ సచివాలయంలో శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధ‌ర్ బాబు..  ఐటి, ఎఫ్ ఎంసీజీ రంగాల్లో పేరు గడించిన విప్రో తమ సంస్థకు అవసరమయ్యే మానవ వనరులకు స్కిల్ యూనివర్సిటీలో స్వయంగా శిక్షణ ఇచ్చి (ఇండస్ట్రీ డ్రివెన్ ట్రెయినింగ్) నియమించుకోవాలని సూచించారు.

డాక్టర్  రెడ్డీస్ ల్యాబ్స్ ఇదే తరహాలో 80 మంది నిరుద్యోగ యువతకు తమ అవసరాలకు తగినట్లుగా శిక్షణ ఇస్తోందని ఆయన తెలిపారు. ఎఫ్ ఎంసీజీ ఉత్పత్తుల పరిశ్రమలను ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలోని 117 శాసనసభ నియోజక వర్గాల్లో మహిళల కోసం మినీ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అక్కడి మౌలిక సదుపాయాలను వినియోగించుకుని పరిశ్రలకు ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. సమావేశంలో విప్రో కార్పోరేట్ వ్యవహారాల ప్రతినిధి వినయ్ రావత్, టీజీఐఐసీ సిఇఓ వి.మధుసూదన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page