wanaparthy | వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2 : రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1 కోటి నిధులతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులను మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించారు. సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు గోత్ర నామాలతో అర్చనలు నిర్వహించి, స్వామి వారి శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైన అదనపు నిధుల విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.