జిల్లాల బాట కాదు.. రైతుల వద్దకు వెళ్లండి

– వారి సమస్యలు తెలుసుకోకుంటే ఉపయోగం లేదు
– కాంగ్రెస్ నేత‌ల‌కు బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హితవు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : కాంగ్రెస్ నాయకులు ముందుగా రైతుల వద్దకు వెళ్లి వారి గోస, సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హితవు పలికారు. జిల్లాల బాట పడుతున్నామని చెబుతున్నారు.. అయితే తమ తప్పిదాలు, నిర్లక్ష్యానికి సమాధానం చెప్పకుండా వారు ఏ బాట పట్టినా అది అవినీతి బాటగానే మిగిలిపోతుందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రభుత్వం ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపాలని, తాము ఎంత ధాన్యం సేకరించనున్నామో, దానికి ఎంత రీయింబర్స్‌మెంట్ అవసరమో తెలియజేయడం విధివిధానాల్లో భాగం అని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేసిందని, చివరి వరకు సరైన అంచనాలు రూపొందించకపోవడమే కాక కేంద్రానికి ఇండెంట్ కూడా సకాలంలో పంపలేదని విమర్శించారు. మార్చి 23 నుంచే కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచి కొనుగోళ్లు ప్రారంభించిందన్నారు. ఈ జాప్యం కారణంగా లారీల కొరత, గన్నీ బ్యాగుల సరఫరాలో లోపాలతో అకాల వర్షాల సమయంలో రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని రామచందర్‌రావు వివరించారు. కొనుగోళ్లకు సంబంధించిన వ్యయాన్ని కేంద్రమే పూర్తిగా రీయింబర్స్ చేస్తోందన్నారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన రాష్ట్రం కేంద్రంపై నెపం నెట్టడం సరికాదని అన్నారు.
మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కు
బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బయటపడిందని రామచందర్ రావు తెలిపారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్‌లో భాగంగా కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారుల అండతో రైతులపై ఒత్తిడి తెస్తూ ధాన్యాన్ని బలవంతంగా రైస్ మిల్లులకు తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులకు గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేదని, క్వింటాల్‌కు 41 కిలోల తూకం ఉన్నప్పటికీ మిల్లర్లు తరుగు పేరుతో 10 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ నిర్ణయించి కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని, రవాణా ఖర్చులను రీయింబర్స్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రుల మధ్య సమన్వయ లోపంతో కొనుగోలు గణాంకాలపై విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయని, ఇది రైతులను తప్పుదారి పట్టించడమేనని ఆయన అన్నారు. మొక్కజొన్న పంటకు కూడా ఇదే దుస్థితి పట్టిందని, జమ్మికుంటతోపాటు అనేక మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా కేంద్ర నిధులతో వీటిని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలన్నారు.
కేంద్రానికి, బీజేపీ సంబంధం లేదు
ఎసఐఆర్ అనేది ఎన్నికల సంఘం చేపట్టే ప్రక్రియ అని, దీంతో కేంద్రానికి గానీ, బీజేపీకి గానీ ఎలాంటి సంబంధం లేదని రామచందర్‌రావు తెలిపారు. 2002 తర్వాత 2025లో కొన్ని రాష్ట్రాల్లో, 2026లో మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపడుతున్నారని, ఇప్పటివరకు సుమారు 57 కోట్ల మంది ఓటర్ల వివరాల ప్రక్షాళన పూర్తి కాగా మరో 37 కోట్ల మంది ఓటర్ల జాబితాను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. తెలంగాణ కూడా ఈ ప్రక్రియలో భాగమేనని, కాంగ్రెస్ పార్టీ ఎసఐఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీలు తమ బూత్‌స్థాయి ప్రతినిధులను నియమిస్తాయని, వారు ఓటరు జాబితాల పరిశీలనలో భాగస్వాములవుతారని తెలిపారు. కాబట్టి ఈ ప్రక్రియ ఏకపక్షంగా జరుగుతోందని చెప్పడం వాస్తవ విరుద్ధమన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా సహకరించాలని సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ చొరబాటుదారులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వంటి అనర్హ వ్యక్తులు ఓటరు జాబితాలో చేరకుండా అన్ని పార్టీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *