ఫలితమిచ్చిన వినూత్న ఈ-వేలం

– గతం కంటే లభించనున్న రూ.202.56 కోట్ల అధిక విలువ
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్ ప్రజాతంత్ర, మే 30 : వానాకాలం 2025-26 సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా 78,916 మంది రైతుల నుండి కొనుగోలు చేసిన 3,80,187 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న విక్రయంలో ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం విధానం ఫలితంగా మునుపటికంటే సుమారు రూ.202.56 కోట్ల అధిక విలువ లభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత పదేళ్లుగా మార్క్‌ఫెడ్‌లో మొక్కజొన్న విక్రయానికి మొదట గోదాము వారీగా ఈ-వేలం నిర్వహించడం, ఆశించిన ధరలు లభించనప్పుడు టు బిడ్ సిస్టం ద్వారా ఈ-టెండర్లు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఏప్రిల్ 1న నిర్వహించిన ఈ-వేలంలో సగం పరిమాణానికి మెట్రిక్ టన్నుకు సగటున రూ.14,355 ధర లభించగా, మరో సగం పరిమాణానికి బిడ్డర్లు ముందుకు రాలేదు. అనంతరం 24న నిర్వహించిన ఈ-టెండర్‌లో సగటు ధర మెట్రిక్ టన్నుకు రూ.14,010 మాత్రమే లభించింది. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాల మేరకు గత టెండర్‌ను రద్దు చేసి రాష్ట్రంలోని సమీప గోదాములను భౌగోళిక ప్రాతిపదికన సమీకరిస్తూ మొత్తం నిల్వలను 25 లాట్లుగా విభజించి ఎక్కువమంది వేలంలో పాల్గొనేలా నిబంధనల్ని సరళీకృతం చేసి తాజా ఈ-వేలం నిర్వహించారు. సరళమైన నిuంధనలతో అధిక పోటీ వాతావరణం, దేశవ్యాప్తంగా బిడ్డర్ల భాగస్వామ్యంతో ఈనెల 29న నిర్వహించిన ఈ-వేలంలో మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,337 ధర లభించింది. ఇది గత టెండర్‌లో లభించిన ధర కంటే టన్నుకు రూ.5,327 అధికం. మొత్తం నిల్వలపై గత టెండర్‌ను ఆమోదించి ఉంటే రూ.532.64 కోట్ల విలువ మాత్రమే లభించేది. అయితే ప్రస్తుత ఈ-వేలంలో హెచ్-1 ధరల ప్రకారం రూ.735.20 కోట్ల విలువ లభించనుండటంతో ప్రభుత్వానికి మునుపటికంటే రూ.202.56 కోట్ల అధిక విలువ లభించింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ భౌగోళిక ప్రాతిపదికన 25 లాట్లుగా విభజించి దేశవ్యాప్తంగా బిడ్డర్ల మధ్య పోటీని పెంచిన ప్రభుత్వ నిర్ణయం వల్లే మెరుగైన ధర లభించిందని, ప్రజా ధనాన్ని పరిరక్షిస్తూ ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.

తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం

రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో శనివారం ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా (డీఐఎల్ ఇండియా), ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆయా సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన, సమయానుకూల వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎవిడెన్స్ యాక్షన్ సంస్థ కంట్రీ డైరెక్టర్ అంకుర్ గర్ న్యూదిల్లీ నుండి జూమ్ ద్వారా పాల్గొని తమ సంస్థ రైతుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాదిమంది రాష్ట్ర రైతులకు ప్రయోజనం చేకూరుతుందంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భవిష్యత్తులో మరిన్ని సేవలను రైతులకు అందించేందుకు కృషి చేస్తామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *