‌గ్యారెంటీలను అమలు చేయలేక అసత్య ఆరోపణలు

దేశం, రాష్ట్రం అభివృద్ధే మా నినాదం..
: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 :  తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌ ‌రెడ్డి బీజేపీపై , వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు. బాధ్యతారహితంగా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపులో తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గెలుపు కోసమో, రెచ్చగొట్టడం కోసమో బీజేపీ రాజకీయాలు చేయదన్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చేయాలనేదే తమ నినాదమని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌ 150 ‌కార్పొరేషన్లలో 50 శాతం బీసీ లకు కేటాయించిన సీట్లలో 30 సీట్లలో నాన్‌ ‌బీసీలు గెలుచుకొని లబ్ధి పొందుతుంటే నోరు మూసుకొని కూర్చోవాలంటే వారికి జనాభా ప్రాతిపదికన హక్కులు రావాలని బీజేపీ పోరాడుతుందన్నారు. ఇది సీఎం రేవంత్‌ ‌నిజ స్వరూపమని మండిపడ్డారు.
తప్పుడు ఆరోపణలను తిప్పికొడుతూ రాష్ట్ర   బీజేపీ కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో కిషన్‌ ‌రెడ్డి మాట్లాడారు. తాను తెలంగాణ అభివృద్ధిపై అనేక ప్రాజెక్టులపై ప్రజలకు వివరిస్తూనే ఉన్నానని చెప్పారు. గత పదేళ్లుగా అనేక కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించకపోవడం వల్ల అమలు చేయలేదన్నారు. పంటలబీమా, ఆయుష్మాన్‌ ‌భవ ఉదాహరణలన్నారు.

తప్పుడు ఆరోపణలపై ఎదురుదాడి..
కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. 14 నెలల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అమలు చేస్తామన్న వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, 320 సబ్‌ ‌గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకుందన్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో నేడు అంతర్గత కుమ్ములాటలు, సీఎంపై అసంతృప్తి ఆయన మాట్లాడుతున్న విధానంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీజేపీ, తనను బ్లాక్‌ ‌మెయిల్‌, ‌బీజేపీని బెదిరించినంత మాత్రాన, అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఆయనపై ఉన్న వ్యతిరేకత పోదన్నారు. నేడు తెలంగాణ ప్రజలు ఆయన మాటలు వినే పరిస్థితి లేదన్నారు.

దిగజారుడు ఆరోపణలు..

పెద్ద గొంతుతో మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. గతపదేళ్లుగా తెలంగాణలో ఏం చేశామనే విషయం ఇదివరకే ప్రజలంతా చూశారన్నారు. రూ. 10 లక్షల కోట్లతో రెండున్నరగంటలపాటు ఆర్టీసీ కళ్యాణ మండపం, పింగళి భవన్‌ ‌లో వివరించామన్నారు. కేంద్రమంత్రి బెదిరిస్తున్నారని దిగజారి సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవన్నీ దిగజారుడు, దివాలాకోరు ఆరోపణలన్నారు. మూడున్నరేళ్లుగా అంకితభావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర కార్యాలయాలు, విద్యాలయాలు, మౌలిక సదుపాయాలపై కేంద్రానికి వివరించి అభివృద్ధిని దరిచేర్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

నా మీద తప్పు రుద్దితే ఊరుకునేది లేదు..
దేశంలో ఏడు టెక్స్ ‌టైల్స్ ‌పార్కులు వొస్తే ఒకటి తెలంగాణకు ఇండస్ట్రియల్‌, ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీ, రీజినరల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వంటి కీలకమైన ప్రాజెక్టులను తీసుకొచ్చానన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు తాను ప్రాధాన్యతనిస్తానని అన్నారు. అంతేగానీ ప్రాజెక్టులు అడ్డుకోవడం లాంటివి కూడా ఊహించడం తప్పే అవుతుందన్నారు. తనమీద తప్పు రుద్దితే ఊరుకోబోనన్నారు. దేశం ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు వాటికి కట్టుబడి ఉండి వాటిని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను ప్రకటించిందని ఇవన్నీ అమలు చేయాలని కేంద్రమంత్రి డిమాండ్‌ ‌చేశారు. ఇవన్నీ అమలు చేయకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రైతు భరోసా రూ. 15వేలు, కౌలు రైతులకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ. 12వేలు, పది పంటలపై అదనపు రూ. 5వేల బోనస్‌, ‌రూ. 5 లక్షల ఇంటి స్థలం, విద్యాభరోసా కార్డు, పెన్షన్‌ ‌రూ. 4 వేలు లాంటి విషయాలలో తన బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నారని, గాలిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రజల సర్టిఫికెట్‌ ‌చాలు..
తనకు రాసిన లేఖలో రూ. 1,66,569.31 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ ‌చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన పరిస్థితి లేదన్నారు. మరీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు కేటాయించారో? చెప్పాలని నిలదీశారు. ఈ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? మేనిఫెస్టోలో పెట్టిందా? అని నిలదీశారు. సీఎం మాటలకు అధికారులే నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం ఇచ్చిన వివరాలను ఆయా మంత్రులవారీగా విభజించి జనవరి 23, నితిన్‌ ‌గడ్కరీ, అశ్వనీ వైష్ణవ్‌, ‌మనోహర్‌ ‌లాల్‌ ‌కట్టర్‌ ‌లకు పంపించామన్నారు.

ఇంత పద్ధతి ప్రకారం తాము పనిచేస్తామన్నారు. వాస్తవం ఈ రకంగా ఉంటే తాను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామని వితండవాదం చేసే ప్రయత్నాలకు తెరతీశారన్నారు. కేవలం రెండున్నర నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అని ప్రశ్నించారు. రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేయించిందే తానన్నారు. ఈ విషయంలో తాను కేసీఆర్‌ ‌కు కూడా అనేక లేఖలు రాశానన్నారు. భూసేకరణపై 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని అనేకసార్లు విన్నవించామన్నారు. సీఎం రేవంత్‌ ‌కు కూడా లేఖ రాశామన్నారు. రింగ్‌ ‌రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం వందకోట్లు కేటాయించిందన్నారు. త్వరలో మంజూరు కాబోతుందన్నారు. తొలిదశ పనులపై కేబినెట్‌ ఓకే చెప్పనుందని, దీనికి సీఎం సర్టిఫికెట్‌ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్‌ ఉం‌టే చాలన్నారు.

మెట్రో అలైన్‌ ‌మెంట్‌ ‌మార్చారు.. రూ. 317 కోట్లకు పెంచారు..

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఫేజ్‌ 2 ‌రింగ్‌ ‌రోడ్డును నిర్మించుకుంటామని అన్ని పత్రికల్లోనూ యాడ్‌ ‌లు కూడా ఇచ్చారన్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఇన్ని లోపభూయిష్ట విధానాలకు పాల్పడుతూ తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడే మెట్రో 2 ఫేజ్‌ ‌కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిందన్నారు. సీఎం రేవంత్‌ ‌రాగానే కేంద్రానికి లేఖ రాసి మెట్రో సమగ్రంగా లేదని 2024 జనవరి 4న దిల్లీకి హర్దిప్‌ ‌సింగ్‌ ‌పూరిని కలిసి కొత్త ప్రతిపాదన విషయాన్ని తెలిపారన్నారు. 2024 అక్టోబర్‌ 26 ‌వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్‌, ‌ప్రణాళిక కేంద్రానికి అందలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ. 234 కోట్లతో ప్రతీ కిలోమీటర్‌ ‌కు, 76 కి.మీ. పొడవుతో ప్రతీ కిలోమీటర్‌ ‌కు రూ. 317 కోట్లకు పెంచుకుందాన్నారు. తొలిదశలో ఫలక్‌ ‌నుమా వరకు అయ్యే ఖర్చులో కేంద్రం రూ 1200 కోట్లు మెట్రోకు ఇచ్చామన్నారు.

అఫ్జల్‌ ‌గంజ్‌ ‌లోనే దాన్ని ఆపివేశారన్నారు. ఇప్పుడు జరుగుతుందన్నారు. ఒక ప్రాజెక్ట్ ‌ప్రతిపాదన వస్తే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాక కేబినెట్‌ ‌లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. మీకే పది నెలలు పడితే ఏ ప్రాతిపదికన కేంద్రం, బీజేపీ, కిషన్‌ ‌రెడ్డి అడ్డుకున్నారని అంటారని? ప్రశ్నించారు. తెలంగాణలో చేపట్టే ఏ ప్రాజెక్టును ఆలస్యం, అడ్డుకునే అవకాశమే లేదన్నారు. మోదీ నేతృత్వంలో అన్ని పనులు సకాలంలో జరుగుతాయన్నారు. ముస్లిం రిజర్వేషన్‌ ‌వ్యతిరేకతపై ఆంధ్రలో స్వతంత్రంగా బీజేపీ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలుపుతామని ఆ విషయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముస్లింలకు ఇప్పకే ఈబీసీ రిజర్వేషన్లు కల్పించామన్నారు. హైకోర్టు తీర్పును గౌరవించడం ఏ రకంగా తప్పు అవుతుందో? సీఎం రేవంత్‌ ‌చెప్పాలని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page