– పొగాకుతో 30-40 ఏళ్ల వయసులోనే ఊపిరితిత్తుల వ్యాధులు
– ‘కేర్’ వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: మొత్తం క్యాన్సర్ కేసుల్లో దాదాపు మూడోవంతు పొగాకు వినియోగ సంబంధమైనవేనని కేర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా దేశంలో పెరుగుతున్న పొగాకు సంబంధిత వ్యాధులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతలో తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ‘ఆకర్షణ ముసుగును తొలగిద్దాం-నికోటిన్, పొగాకు వ్యసనానికి అడ్డుకట్ట వేద్దాం’ అనేది ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన థీమ్ అని చెప్పారు. పిల్లలు, యువతను ఆకర్షించేందుకు పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల తయారీ సంస్థలు ఫ్లేవర్డ్ ఉత్పత్తులు, వేపింగ్ పరికరాలు, నికోటిన్ పౌచ్‌లు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి మార్గాలను వినియోగిస్తున్నాయని ఈ థీమ్ ప్రాధాన్యంగా చర్చిస్తోంది. పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెరిగినప్పటికీ దేశం ఇప్పటికీ పెద్ద ప్రజారోగ్య సవాలును ఎదుర్కొంటోందని వైద్యులు తెలిపారు. దేశంలో సుమారు 26.7 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తుండగా ప్రతి సంవత్సరం 13 లక్షల మందికి పైగా పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా 30-40 ఏళ్ల వయస్సు వారిలో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. పరోక్ష ధూమపానం వల్ల కూడా తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఆస్తమా దాడులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని పేర్కొన్నారు. పొగాకు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ భారం పడుతోందని నిపుణులు తెలిపారు. పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్స ఖర్చులు, ఉత్పాదకత నష్టం కారణంగా దేశం ప్రతి సంవత్సరం సుమారు రూ.1.7 లక్షల కోట్లకు పైగా నష్టపోతోందని అంచనా.
ఊపిరితిత్తుల్లో సమస్యతో హాస్పిటల్స్‌కు యువత : డాక్టర్ జయచంద్ర 
హైదరాబాద్ కేర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, హెచఓడీ, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జయచంద్ర మాట్లాడుతూ నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల పనితీరు తగ్గిపోవడం, ఆస్తమా తీవ్రత పెరగడం, ప్రారంభ దశ సీఓపీడీ (దీర్ఘకాలిక ఊపిరితిత్తుల అవరోధ వ్యాధి) వంటి సమస్యలతో యువత హాస్పిటల్స్‌కు వస్తున్న సంఖ్య పెరుగుతోంది. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తుల నష్టం చాలా సంవత్సరాల తర్వాతే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ దాని ప్రభావం చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. లక్షణాలు కనిపించే సమయానికి సరిచేయలేని స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో 5.5 కోట్ల మందికి పైగా సీఓపీడీ (దీర్ఘకాలిక ఊపిరితిత్తుల అవరోధ వ్యాధి)తో బాధపడుతున్నారని, దీనికి ప్రధాన కారణాల్లో ధూమపానం ఒకటని ఆయన తెలిపారు. అలాగే వేపింగ్, కొత్త తరహా నికోటిన్ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుండటంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ-సిగరెట్లు, నికోటిన్ పౌచ్‌లు, ఫ్లేవర్డ్ వేపింగ్ పరికరాలను సురక్షిత ప్రత్యామ్నాయాలుగా ప్రచారం చేస్తున్నారు. నికోటిన్ వ్యసనంతో శ్వాసనాళాల్లో వాపు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల నష్టం వంటి ప్రమాదాలు అలాగే ఉంటాయి అని డాక్టర్ జయచంద్ర తెలిపారు. పొగాకు వల్ల కేవలం వినియోగదారులకే నష్టం జరుగుతుందని అనుకోవడం అపోహ అని, ఇది కుటుంబాలు, కార్యాలయాలు, ఆరోగ్య వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు. ఎంత త్వరగా పొగాకు మానేస్తే అంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు. సరైన వైద్య సహాయం, మార్గదర్శకతతో పొగాకు వ్యసనం నుంచి బయటపడటం పూర్తిగా సాధ్యమే అని డాక్టర్ జయచంద్ర పేర్కొన్నారు.
సిగరెట్ పొగలో 7వేల రసాయనాలు 
పొగాకు కారణంగా పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధి గురించి కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యుగందర్ రెడ్డి మాట్లాడుతూ పొగ తాగడం వల్ల కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని చాలామంది భావిస్తారు.. కానీ వాస్తవానికి సిగరెట్ పొగలో 7,000కు పైగా రసాయనాలు ఉంటాయి అని చెప్పారు. వాటిలో కనీసం 69 క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉంటాయని, నోరు, గొంతు, స్వరపేటిక, ఊపిరితిత్తులు, ఆహారనాళం, కడుపు, కాలేయం, ప్యాంక్రియాస్, పెద్దప్రేగు, మూత్రపిండాలు, మూత్రాశయం, గర్భాశయ ముఖద్వారం, రక్త క్యాన్సర్లకు కూడా పొగాకు ప్రధాన కారణంగా నిలుస్తోంది అని తెలిపారు. మొత్తం క్యాన్సర్ కేసుల్లో దాదాపు మూడోవంతు పొగాకు వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు. నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు యువతలో కూడా పెరుగుతున్నాయి. నిరంతర దగ్గు, కఫంలో రక్తం, కారణం లేకుండా బరువు తగ్గడం, నోటిలో మానని పుండ్లు, స్వరంలో మార్పులు, మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్ల ఆలస్యంగా నిర్ధారణ అవుతోంది. ముందస్తుగా గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఏ వయసులోనైనా పొగాకు మానేస్తే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది అని డాక్టర్ యుగందర్ రెడ్డి వివరించారు.
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ నిపుణులు పొగాకు మానాలనుకునే వారు కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, వైద్య సహాయం వంటి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




