రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్‌..

˜అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం
˜ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వొచ్చే అవకాశం
˜బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని.. దానిని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని  తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ సోమవారం నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఉన్న బలంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నామని తెలిపారు. అప్పుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇంకా ఎన్నేళ్లు అబద్ధాలు చెబుతారని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ సమావేశాల తీరు కూడా అబద్ధాలు, బుకాయింపులతోనే సాగుతుందని ఆరోపించారు. ఫార్ములా ఈ కార్‌ రేసులో మళ్లీ తనకు నోటీసులు ఇస్తారని అభిప్రాయపడ్డారు.

ఈ నెల 16న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టి.. 17న తనకు నోటీసులు ఇస్తారని అన్నారు. తనను విచారణకు పిలిచి నాటకాలు ఆడే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కార్‌ రేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని పునరుద్ఘాటించారు. ఫార్ములా ఈ కార్‌ రేసుకు రూ.45 కోట్లు ఖర్చు చేస్తే తప్పు అని అన్నారని కేటీఆర్‌ అన్నారు. మరి అందాల పోటీలకు రూ.200 ఖర్చు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మిస్‌ వరల్డ్‌ పోటీలతో రాష్ట్రానికి ఏం లాభం వొస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డిని నిలదీశారు.

సీఎం ఒలింపిక్స్‌ పెడతానంటున్నాడని.. అందుకు రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని తెలిపారు. బీసీలపై అంత ప్రేమ ఉంటే దిల్లీలో జంతర్‌ మంతర్‌లో కూర్చొని ఆమరణ దీక్ష చేయాలని రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం 30 శాతం కమీషన్లు తీసుకుంటోందని కేటీఆర్‌ ఆరోపించారు. కాంట్రాక్టర్లు భయపడి 20 శాతం తక్కువ చేసి చెబుతున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page