డీహైడ్రేషన్‌.. తేలిగ్గా తీసుకోవద్దు

– ఎండలు పెరిగితే కిడ్నీలకే మొదటి దెబ్బ
– వేసవిలో కిడ్నీ రాళ్లు, మూత్ర ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి
– తీవ్రమైన మూత్రపిండ సమస్యలకు దారితీసే ప్రమాదం
– కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: వేసవి కాలం అంటే చాలామందికి గుర్తొచ్చేది దాహం, అలసట, వడదెబ్బ. కానీ ఎండల తీవ్రత వల్ల మౌనంగా దెబ్బతినే అవయవాల్లో కిడ్నీలు ముందుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యేటా ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ కిడ్నీ రాళ్లు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మూత్రంలో మంట, మూత్రం తగ్గిపోవడం, నడుము-పక్క భాగంలో తీవ్రమైన నొప్పి వంటి సమస్యలతో హాస్పిటల్స్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని యూరాలజిస్టులు చెబుతున్నారు. వేసవిలో చెమట రూపంలో శరీరం అధికంగా నీటిని కోల్పోతుంది.. అదే సమయంలో తగినంత నీరు తాగకపోతే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడంతో మూత్రం సాంద్రత పెరుగుతుంది.. ఈ పరిస్థితిలో మూత్రంలో ఉండే కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు స్ఫటికాలుగా మారి క్రమంగా కిడ్నీ రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.. అని కేర్ హాస్పిటల్స్ వైద్యులు చెబుతున్నారు.

యూరాలజీ కేసుల్లో పెరుగుదల 
– డాక్టర్ నవీన్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్, యూరాలజిస్టు అండ్ ఆండ్రాలజిస్ట్, మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్‌

వేసవి ప్రారంభమైన తర్వాత యూరాలజీ కేసుల్లో పెరుగుదల చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా కిడ్నీ రాళ్లు, యూరిన్ ఇన్‌ఫెక్షన్లు, మూత్రంలో మంట, తీవ్రమైన ఫ్లాంక్ పెయిన్‌తో రోగులు ఎక్కువగా వస్తుంటారు. చాలామంది ఇది ఒక్క రోజులో వచ్చే సమస్య అనుకుంటారు. కానీ పదేపదే డీహైడ్రేషన్‌కు గురవడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్య క్రమంగా పెరుగుతుంది.
వందమందిలో 12 మందికి కిడ్నీ రాళ్ల సమస్య వచ్చే అవకాశం 
– డాక్టర్ వేణు మన్నే, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్‌
దేశంలో ప్రతి వందమందిలో సుమారు 12 మందికి జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీ రాళ్ల సమస్య వచ్చే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. వేడి ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత అధికంగా కనిపిస్తోంది. కిడ్నీలో రాళ్లకు కేవలం నీళ్లు తక్కువ తాగడం మాత్రమే కారణం కాదు. వేసవిలో అధిక ఉప్పు ఉన్న ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్, చల్లని పానీయాల పేరుతో అధికంగా సాఫ్ట్‌డ్రింక్స్ తీసుకోవడం, బయట ఫుడ్ ఎక్కువగా తినడం వంటివి దోహదపడతాయి.
మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది
కిడ్నీ రాళ్లతోపాటు వేసవిలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రం పరిమాణం తగ్గి బ్యాక్టీరియా శరీరం బయటకు వెళ్లకుండా నిల్వ ఉండటంతో ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలు, డయాబెటిస్ ఉన్నవారు, ప్రోస్టేట్ సమస్యలున్న పురుషులు, గతంలో తరచూ యూరిన్ ఇన్‌ఫెక్షన్లు వచ్చినవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే చాలామంది దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం. వైద్యుల ప్రకారం దాహం వేయడం అంటే శరీరం అప్పటికే డీహైడ్రేషన్‌లోకి వెళ్లిందనే సంకేతం. అలాగే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసులు తాగితే సరిపోతుందని అనుకోవడం కూడా తప్పు. హైడ్రేషన్‌కు అసలు ప్రత్యామ్నాయం నీళ్లే. కేఫిన్, అధిక చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ మరింత పెరగవచ్చు. పైగా అవి కొన్ని సందర్భాల్లో స్టోన్ ఫార్మేషన్‌కు దారితీసే మెటబాలిక్ మార్పులను కూడా ప్రోత్సహిస్తాయి అని డాక్టర్ నవీన్ కుమార్ స్పష్టం చేశారు.
వైద్యులు హెచ్చరిస్తున్న లక్షణాలు ఇవి

నడుము లేదా పక్క భాగంలో ఆకస్మికంగా వచ్చే తీవ్రమైన నొప్పి.. మూత్రంలో మంట లేదా రక్తం కనిపించడం.. మూత్రం తగ్గిపోవడం.. తరచూ మూత్రం రావడం.. జ్వరం, వాంతులు, అలసట.. కడుపు దిగువ భాగంలో ఒత్తిడి లేదా నొప్పి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత క్లిష్టమై అత్యవసర చికిత్స అవసరమయ్యే స్థితి రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వేసవిలో కిడ్నీలను కాపాడుకోవాలంటే..

 దాహం వేయకముందే నీళ్లు తాగాలి. బయటకు వెళ్తే వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలి. ఎండలో పని చేసే వారు మరింత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ముసంబి, కొబ్బరి నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. అధిక ఉప్పు, ప్యాకెట్ ఫుడ్స్, సాఫ్ట్‌డ్రింక్స్ తగ్గించాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. వేసవిలో వచ్చే కిడ్నీ రాళ్లు, యూరిన్ ఇన్‌ఫెక్షన్లలో చాలావరకు పూర్తిగా నివారించగలిగేవే. సరైన హైడ్రేషన్, సమయానికి చికిత్స కిడ్నీలను పెద్ద ప్రమాదాల నుంచి కాపాడగలవు అని వైద్యులు చెబుతున్నారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *